ఒక్క తొలకరి కోసం...
Part 1:
పసితనంలోనే పశువుల కాపరి అవతారమెత్తాన్నేను...
పసితనంలోనే పశువుల కాపరి అవతారమెత్తాన్నేను...
పాఠశాల విద్య పరితపించి వెతికినా గుర్తురావడంలేదు ....
బాల్యంలోనే కార్మికరంగంలో పద్మశ్రీ గ్రహీతను నేను
సగ జీవితం అదృష్ట దురదృష్టాల మధ్య యుద్ధం చేశాను
పుట్టుకతో పేదరికం అనే జన్యు సంబంధ జబ్బు ఉందినాకు
డిగ్రీ చదివాక నిరుద్యోగం అనే అంటు వ్యాధి కూడా సోకింది
కాలాన్ని ... విధిని ఎంత నిందించినా కడుపు నిడడంలేదు
పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రతిరోజూ పాకీ పని చేస్తున్ననేను
ఏ ప్రభుత్వ భీమా వర్తించని బీడుబారిన బ్రతుకు నాది ...
బ్రతకడానికి ప్రతిరోజూ చస్తున్న వాడిని....
నేడు నిన్ను ఎదిరించినందుకు నన్ను చంపేస్తానంటే?
నాకు భయం పుడుతుందంటావా దొరా ....!!!
part 2:
ఈ రోజు ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిదో ....
ఈ నాటి ఈ మనోవేదన ఏ నాటి అత్యుత్సాహానిదో ...
ఈ జననం రెండు జీవకణాల ఆవేశ కలయిక
ఈ పుట్టుక నా ప్రమేయం లేని ఒక ప్రమోద సంఘటన
ఒక పరిమళపు పవనం కోసం ...
అనేక దుర్గంధపు తుపానులకు ఎదురీదుతున్న సమయం
నిరాశ ... నిస్తేజం .... నిరీక్షణల సమ్మేళనం ఈ జీవితం
ఒక్క తొలకరి కోసం ..... అనంతకోటి ఆశల చూపులు
ఈ రోజు ఉదయం అత్యంత చీకటిగా వుంది నాకు ....
అమావాస్య వెన్నెలని చూసాను నేనివాళ .... !!!
- ప్రభానవీన్
Comments
Post a Comment