మనస్సు దరహాసం

                                 




                                                     సాయంత్రం అయింది, మొఖం కాస్త కడుక్కుందామని వరండాలో వున్న  కుళాయి వద్దకి వెళ్ళాడు నవీన్, కొంచెం హడావిడిగా.... ఇంతలోనే తన చరవాణి మోగింది ఏదో పవన్ కళ్యాణ్ సినిమాలో పాట వినిపిస్తూ..... ఎవరో ఫోన్ చెసారన్న విషయం అర్థమై రూమ్ లోంచి రాము "ఎవరో అభిమానులు ఫోన్ చేస్తున్నారు సామి నీకు" అని అరవడం ప్రారంభించాడు ఫోన్ చూస్తూ. తన మొఖం మీద వున్న నీటి బొట్టులను తన ఎడమ చేతిలో వున్న తువ్వాలితో తుడుచుకుంటూ, ఒకింత అసహనంతో తనలో తానూ గొణుగుకుంటూ లోపలికి వచ్చాడు నవీన్.  'ఇదొక్కటి చాలు సామి జీవితం తలకిందులు కావడానికి' అని చరవాణి గురించి అంటూ! నిజానికి  తన అసహనం ఆ సమయంలో ఫోన్ చేసినవారి మీదా కాదు, అక్కడ రింగ్ టోన్ గా  వినిపిస్తున్న పాటమీదా కాదు, అస్సలు చరవాణి మీద కూడా కాదంటే నమ్మండి.... అంతటకీ కారణం అలసటతో కూడుకున్న తన గత వారం రోజుల ప్రయాణం మరియు నిన్న సాయంత్రం మొదలు దాదాపు ఈ రోజు తెల్లవారే వరకు సాగిన పరిశోధనా పత్రము యొక్క పని. ఈ సంఘటనల వలనే తను అలా అంటున్నాడు. మూడు రోజుల క్రితమే దసరా పండగ జరిగింది. ఈ సారి వాళ్ళ ఊరిలో ఎంతో సంభరంగా చేసారు దసరా. నిన్ననే హుటాహుటిన మల్లి వైజాగ్ రావాల్సి వచ్చింది కూడాను, అందు చేత వచ్చిన మాటలు అవి.  అలా వచ్చి ఇలా ఫోన్ అందుకున్నాడు. తాను ఎంత గందరగోలంలో ఉన్నా ఆ రింగ్ టోన్ నిజానికి అతనికి కొంత ప్రశాంతత కలిగిస్తుందట, కారణం అందులో ఉన్నా సంగీతమో  లేక సాహిత్యమో అనుకుంటే తప్పులో కాలువేసినట్టే సుమీ, తనకి ఆ పాట వినగానే గురుతొచ్ఛేది పవన్ కళ్యాణ్ అంట. అతను గురుతు రాగానే ఒక్కసారిగా తన మూడ్ అంతా  ఒక్కసారిగా ఒక వినూత్న మైన స్థితిలోకి వెళుతుందని తను అప్పుడప్పుడూ అంటుంటాడు. కళ్యాణ్ అంటే అంత అభిమానం తనకి. ఈ టెక్నాలజీ  తీసుకువచ్చిన చరవాణి మీద తనకి ఎంత గౌరవం ఉందో, దానిని ఉపయోగిస్తున్న విధానం పైన అంత అసహనం కూడా ఉంది నవీనుకి. అదంతా ఒక పెద్ద ఫిలాసఫీ లెండి. ఏమైతేనేం ఫోన్ అందుకున్నాడు, తన సంభాషణలో మునిగిపోయాడు వెనువెంటనే.

                                  తాను ఎప్పటి నుంచో ఒకటి అనుకుంటున్నాడు , ఇదిగో ఇన్నాళ్ళకి సాహసం చేయగలిగాడు. తనది అంత  పెద్ద అనుభవమూ కాదు అందులో అంత విశేషమూ లేదు, కానీ అందులో ఏదో తెలియని అనుభూతి మాత్రం ఖచ్చితంగా ఉందని చెబుతూ ప్రారంభించాడు నవీన్  తన కథ.  ఎందుకంటే ఇది తన మనసు గాధ అని, "ఇది  జరిగి దాదాపు ఒక దశాబ్దం కావొస్తోంది, అయినా ఆ జ్ఞ్యాపకాలు ఇప్పటికీ కళ్ళముందు మెదలాడుతూనే ఉన్నాయని, అందుకే అంటున్నాను వాటిలో ఏదో అనుభూతి ఉందని" అంటున్నాడతను. వాటికి అక్షర రూపం ఇవ్వాలని నేడు ఎందుకో అనిపిస్తుంది అతనికి, అందుకే మారు ఆలోచించకుండా తన ఎదురుగా వున్న కలాన్ని నెమ్మదిగా తీసాడు. అంతవరకూ సాహసం చేయగలిగాడు. ఇప్పుడు అస్సలు విషయం ప్రారంభం అయింది తన మదిలో, ఏం రాద్దాం .... కథనా  లేక నవలనా.... నవలైతే చాలా పెద్దది కావాలేమో! ఎలా లేదన్న తక్కువలో తక్కువ 150 పేజీలు వుండలేమో కదా! .... అంత నేను రాయగలనా ! ఇంత వరకు మూడు పేజీల కథను కూడా మునుపెన్నడూ నేను రాయలేదే ..! పోనీ కథ  రాద్దామా! కధ  అయితే మరి చిన్నదిగా ఉంటుందేమో! మరి నవలిక రాద్దామా! అయినా ఇప్పుడు  నవళికలు  ఎవరు చదువుతున్నారని గనకా ? ఇలా క్షణాల్లో ఎన్నో ఆలోచనలు తన మైండ్ లోకి అలా వస్తున్నాయి. అయినా నేను రాసింది ఎవరో చదువుతారనో లేక ఎందులోనో ప్రచురిద్దామనో కాదుగా, కొంచెం మదిలోని భావనలకి ఒక అక్షర రూపం ఇస్తే అదోక సంతృప్తి, తెలియని ఆనందం కూడాను.  వీలున్నప్పుడు చదువుకుంటే మనసు ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది కాదా అని తన ఆలోచన. అదిసరే ఎలా రాయడం! అస్సలు ఎక్కడ నుంచి ప్రారంభించడం? ఏ విషయాలు గురించి  రాయడం? ఏ పాత్రలు తీసుకోవడం? ఇలా అన్నీ ప్రశ్నలే. పెన్ను కాగితంఫై మోపితే వట్టు. కొద్ది సమయం గడిచాక, ఏది ఏమైనా  ఓ  చిరు ప్రయత్నం చేద్దాం అని బలంగా అనుకున్నాడు. ఆ స్పృహతోనే తన రచనా ప్రస్తావనలోకి జారుకున్నాడు మెల్లగా....

                                   బహుశా ఆ రోజు సోమవారం అనుకుంటా! ఈ వారాలేంటో ఉన్నవి ఏడు మాత్రమే అయినా ఏ విషయం ఏ రోజు జరిగిందో అని ఆలోచిస్తే మాత్రం ఎప్పుడూ తడబాటే. అది 2016 అక్టోబరు 15 వ తేది అనుకుంటా బాగా గురుతు. నేను విశాఖ నుంచి సాయంత్రం నా చిన్ననాటి మిత్రుడు కార్తీకుతో కలిసి అనకాపల్లి మరో స్నేహితుడి వద్దకు బయలుదేరుతున్నాను. అప్పటికే ముందు రోజు రాత్రి దాదాపు కంటికి సరిపడా నిద్రలేక చాలా అలసటతో వున్నాను, ఏదైతేనేం అనుకున్న పరిశోధనా పత్రం పని కాస్త అనుకున్నట్టు పూర్తి చేయగలిగాను, అదే చాలు.  రాము ఇంటినుంచి సాయంత్రం బయలుదేరే సమయం ఆసన్నమైంది. అలా మొఖం కాస్త కడుక్కుందామని హాల్లో  ఉన్న  పంపు వద్దకి వెళ్ళాను. అలా నీళ్లు నా నుదిటిని తాకాయో లేదో ఇంతలోనే నా చరవాణి మోగడం ప్రారంభించింది. ఏదో కొత్త నంబర్ నుంచి, ఎప్పటిలాగానే ఫోన్ లేపటం జరిగింది. అంతా అరక్షణంలో జరిగిన సంఘటన అనే చెప్పాలి. ఏదో నూతన గొంతు  వినిపించింది అతి శ్రావ్యంగా, ఎంతో మధురంగా. ఆ గొంతు  మనసుకి చాలా దగ్గరగా ఉన్నదే అని అర్థమైంది. ఆ సంభాషణ ఇలా కొనసాగింది....
                                              "ఎవరూ నవీనేనా!"
                                               హ..  యెస్ నవీనే.... ఎవరూ?...
                                               "నేను మరిచిపోయావా?"
           
                                అంతే! అప్పటి వరకూ  ఉన్న ఆలోచనలన్నీ ఒక్కపెట్టున ఎలా మాయమైనవో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఆ మాటవిన్న తరువాత ఇసుమంత కూడా సమయం తీసుకోకుండా చెప్పాను,
                                  నిన్ను ... "నిన్ను నేను మరిచి పోవడమా! అది అస్సలు జరిగే పనేనా .. .'
                                 "నేను పద్మని" ఫోన్లో అవతలనుంచి నెమ్మదిగా వినపడ్డ మాట."
                               అయ్యో గురుతుంది పద్మా.... ఎలావున్నావ్?  ఇసుమంత కూడా తడబాటు లేకుండా అడిగిన మాట ఇది. ఈ మాటపలికాక నా మనస్సు తదుపరి సమాధానం కోసం వేచిచూస్తున్నట్టు ఎంతమాత్రం అనిపించలేదు. క్షణాల్లో ఒక్కసారి ఏవేవో ఆలోచనలు, వాటికి ఒక దిశ కాని ఒక నిర్దిష్ట  రూపం కానీ లేవనే చెప్పాలి. ఎందుకంటే అది ఒక మధ్యతరగతి మనస్సు నుంచి పుట్టిన ఆలోచనలు కాబట్టి. అయ్యో అదేమిటి! మనస్సేమిటీ .....  అదీ మధ్యతరగతి మనస్సు ఏమిటీ?  అని మీకు అనిపించవచ్చు. అది అంతే. దాదాపు ఏడు సంవత్సరాలు ఒక మృదుమధురమైన శబ్దం కోసం వేచివున్న మనస్సు అది, ఒక మధ్యతరగతి మనస్సు అది. 

                                         ఉన్నది మొదటి అంతస్తు ఎత్తులో అయినప్పటికీ పారిస్ ఈఫిల్ టవర్ పైన ఉన్నంత ఉల్లాసం.....  ఉన్నది విశాఖ నగరంలో అయినా ప్రేమకోసం నిర్మించబడ్డ ఒక పేద్ద నగరంలో ఉన్నంత అనుభూతి,  ఆ ఒక్క క్షణంలో తల్లడిళ్లాయంటే  నమ్మండి.
                       "హలో .... హలో .... హలో  నవీన్ ఉన్నావా?" వెనువెంటనే వినిపిస్తున్న మాటలు....
గుక్కురమని ఒక్కమాటున మళ్ళీ ఆ మాటల్తో సాధారణ స్థితికి వచ్చాను.
                        హా....  పద్మ ..... ఉన్నాను .
                       ఎలా ఉన్నావ్ ? అన్నాను కొంచెం షాక్ లోనే ఉంటూ ....
                       "నేను బాగున్నా .... నీవెలా వున్నావ్" అంది, ఎప్పటిలాగానే ఎంతో  మృదుమధురంగా..... ఎంతో దరహాసంగా ....... " కచ్చితంగా బాగానే ఉన్నా అనే జవాబే వస్తుంది నానుంచి. ఎందుకంటే అక్కడ ఉన్నది, మాట్లాడుతున్నది ఒక మధ్యతరగతి మనస్సు. నిజానికి ఇది ఎంత మాత్రం షాక్ కాదు, ఎందుకంటే ఇది అనుకోని ఫోన్ కాల్ కాదు. ఎప్పటినుంచో అనుకుంటున్న ఫోన్  కాలే! ఆశిస్తున్న విషయమే,  అయినప్పటకీ ఈ రోజు ఈ సమయంలో వచ్చే సరికి ఒకింత సంబ్రమాశ్చర్యానికి గురికావాల్సి వచ్చిందంతే....  ఈ గొంతు కోసమే ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న వ్యక్తి , ఒక్కసారి ఇలా తాను కోరుకున్న వ్యక్తి నుంచి పిలుపు రాగానే అది ఒక కలలా  అనిపించింది.
                     క్షణాల్లో గల గలా ఏవేవో ప్రశ్నలు టపటపా  దొర్లాయి,  ఇసుమంత కూడా కాలీ  లేకుండా రెండువైపులా నుంచీనూ ఫోన్లో
 .
                                     ఎక్కడున్నావ్ అని అడిగాను ఎంతో ఆతృతగా...
                                    "వైజాగ్ లోనే"  అని జవాబు.   
                            ఒకింత ఆచర్యానికి లోనవ్వక తప్పలేదు.

                             వో మై గాడ్! ఈస్ ఇట్స్ ట్రూ ఆర్ డ్రీమ్.....! నాలో నేను అంతర్లీనంగా... !
                    నిజమే.... ఇది  నిజమే.... తను  పద్మనే ..... మాట్లాడుతున్నది పద్మనే ..... నో డౌట్ ఇట్ ఈస్ ట్రూ.
                     ఒక్కసారి ఊపిరి గట్టిగా పీల్చుకున్నా,  కొంచెం ధైర్యంకోసం....!

                           "వాట్ .... నిజమా.... నువ్వు వైజాగ్ లో ఉన్నావా! రియల్లీ!
                             నేను నిన్ను కలవొచ్చా! ప్లీజ్.... నేను చిన్న వాల్తేర్ లో ఉన్నాను...
                             ప్లీజ్ నీవెక్కడ ఉన్నవో చెప్పు, నీకు  వీలైతే ఇప్పుడే  కలుస్తాను... పదాలు దబ దబా వచ్చేశాయ్ అర సెకెన్ లో  నా ప్రమేయం ఇసుమంత కూడా లేకుండ. "

                               "హా .... బట్ నాట్ నౌ " అనే సమాధానం.!

                        ఒక్కసారిగా అందిన ఒక గొప్ప అవకాశం అందినట్టే అంది దూరమైనదనే ఫీలింగ్!
                                "నేను దసరా సెలవులకి ఇంటికి వచ్చాను, వైజాగ్ రావడానికి మరి కొద్ది రోజులు పడుతుంది."
                      ఆ మాట వినగానే నన్ను వెంటనే పాతాళానికి తొక్కినట్టు అనిపించింది.  మల్లి కుదురుకొని..... నిదానంగా సంభాషణ కొనసాగించే ప్రయత్నం చేశాను.

                      వో ...... సర్లే పద్మా. అందరూ బాగున్నారా ఇంట్లో?
                  " యహ్ ..... ఆల్ ఆర్  ఫైన్ హియర్."
                   ఓకే పద్మ ..... నౌ ఐ నీడ్ టు గో  టు అనకాపల్లి.  ఐ విల్ కాల్ యూ  విత్ ఇన్ వన్  అవర్ .... ప్లీజ్ రిసీవ్ మై కాల్.....  ప్లీజ్....!

                     "ఓకే నవీన్ సరే ..... "
                      నీ నెంబర్ ఇదే కదా....
                      "హా ఇదే.... "
                       ఓకే ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ ఫోన్ ..... ఐ విల్ కాల్ యూ పద్మా.
                      "ఓకే ఓకే .... "
                        సరే పద్మ.....  బాయ్!
                        "బాయ్ నవీన్ ".

                         ఫోన్ అయితే కట్ చేశాను కానీ, నా మదిలో ఆ క్షణంలో చెలరేగుతున్న విభిన్న ప్రశ్నలకి మాత్రం సమాధానాలు లేవు. వెతికే ప్రయత్నం కూడా ఏమీ చెయలేదు. కొద్దిసేపు వాటిని అలాగే విహరించే స్వేచ్ఛ కల్పించాలి అనుకొని వదిలేసా. అంతే అవి వీరవిహారం చేసేస్తున్నాయ్..... నా ఆలోచనలనే కాదు  నా శరీరంలోని నరాళ్లన్నింటిని  వాటి అనుమతిలోకి తీసుకున్నాయి అతి కొద్ది క్షణాల్లోనే. లోలోపల ప్రవహిస్తున్న ప్రతి రక్తకణంలో అవే ఆలోచనలు, ప్రతి కండర కణంలోనూ అవే ఊసులు. అసలు ఏమీ అర్థం కాలేదు కొన్ని నిమిషాల పాటు. ఇంతలో కార్తీక్ నుంచి "కాకా వెల్దామా? అని ఒక ప్రశ్న. అప్పుడే ఉదయించన్నట్టు అనిపించింది.                             హా .... సరే సరే వెళ్దాం.....  అని నా లగేజ్ బేగ్ తీసుకున్నా !

                          మేమిద్దరం మాతో మరో ఇద్దరు అనుకుంటా.....! నడుచుకుంటూ చినవాల్తేరు  రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. దారిలో ఉన్న జగన్నాధస్వామి ఆలయం ఎప్పుడూ చూసేదే అయినా ఈ రోజు అలా లేదు. దేవుడు ఈ గుడిలో నిజంగానే ఉన్నాడు అనే ఫీలింగ్......! ఇంతలోనే మధ్యలో నా చెల్లెలు ఎదురుపడింది, నేను వెళ్లిపోతున్నా అని తెలిసి  వీడ్కోలు పలకడానికి వచ్చింది. అంతవరకు తనతో ఏదో చెప్పాలని అనుకున్నాను. ఏమీ గురుతు లేదు.... ఇంతకముందు చెప్పినట్టుగా నా శరీరం ఆ సమయంలో ఒక భౌతికమైన పదార్ధం మాత్రమే. అలా అని ఆలోచనలు లేనిది కాదు. అణువణువూ  ఆలోచనలే.... కాకపోతే అవన్నీ ఒక్కరి చుట్టూనే తిరుగుతున్నాయి, అదీ విషయం. ఇంతలోనే ఆటో స్టాండ్ వచ్చేసింది. కాంప్లెక్స్ ..... కాంప్లెక్స్ ..... కాంప్లెక్స్ ..... సార్ కంప్లెక్సకా అని ఒకరు.....
జగదాంబ ..... పూర్ణా మార్కెట్ ...... జగదంబా అని మరో ఆటో సోదరుడు అరుపులు స్పష్టంగా చెవిలో పడ్డాయ్ . అప్పుడు కొంచెం ధ్యాస ఎదుటిగా వున్న  వర్తమాన ప్రపంచంలోకి వచినట్టయింది. ఆటో ఆర్ టి సి కాంప్లెక్స్ చేరడం అక్కడనుంచి రాముకి బై బై చెప్పడం ఎలా జరిగిపోయాయో...... !

                                కార్తీక్ మరియు బాలుతో కలిసి వైజాగ్ ఆర్ టీ సి కాంప్లెక్స్ నుంచి అనకాపల్లి వెళ్లే బస్సు ఎక్కాం.... నా మొఖం పున్నమి రాతిరి నిండు చంద్రుడిలా తలా తలా వెలిగిపోతోంది.  ఆ విషయం నా మనస్సుకి స్పష్టంగా తెలుసు. ఆ సంగతి నాతో వస్తున్న నా మిత్రులకి కూడా అర్థమైనది. నా ఉత్సాహానికి కారణమ్ అప్పటికే  బాలూ గాడికి తెలుసు, కానీ కార్తీక్ కు మాత్రం అస్సలు తెలీదు. వాడు నన్ను చూస్తూ కాసింత  ఆశ్చర్యానికి  గురి అవుతున్నాడని నాకు చాలా  తేలిగ్గా  అర్థమైంది. వాడు  నేను ఒక అమ్మాయిని ఇంతలా ఆరాధిస్తున్నానన్న విషయం ఏనాడు ఊహించి ఉండడు. అందు చేత వాడి ముగ్ధ ఆర్చర్యానికి  కారణం లేకుండా పోలేదు.  బస్సు మెల్లగా ప్రారంభం కావడం, హైవే ఎక్కడం అన్నీ జరిగిపోయాయి. ఈ మొత్తం వింత ప్రవర్తనని గమనించిన కార్తీక్ ఉండబట్టలేక అడిగేశాడు....
                "అరేయ్ ఏమిటి విషయం! అంతా నీలో నువ్వే ...... హా ...... చెబుతావా చెప్పవా ?" అని,
"వాడి విషయం ఎం అడుగుతావ్ లే అది సైలెంట్ కిల్లర్ టైపు కాండిడేట్ అని బాలు గాడు సెటైర్" .  తప్పనిసరి పరిస్థితిలో ఏదో  ఒకలా తప్పించుకోవాలి కనక అప్పుడెప్పుడో ఏదో తెలుగు సినిమాలో చూసిన రావు గోపాలరావు డైలాగు ఒకటి గురుతొచ్చి " మనిషన్నాక కూసంత కళాపోషణ ఉండల్లేవో అని అన్నాను".  వాడికి బాగా నా గురించి తెలుసు, నేనేది ఒక సారిగా ఓపెన్ అవ్వనని. వాడు అంతటితో వాడి అత్యుత్సాహ ప్రశ్నలని ఆపడని నాకూ తెలుసు. ఎందుకంటే వాడు నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం .... కలిసి చదివాము .... కలిసి తిరిగాం...  నాకు సిగ్గు పుట్టేలా వాడూ అన్నాడు ....
                             "ఎల్లెలవో ..... చెప్పావ్ గాని ..... " అని,
                             అస్సలు విషయం చెప్పమంటే రావు గోపాల రావు సెటైర్స్ నువ్వూ ....  చెబుతావా .... లేదా.   
            నాకు వేరే మార్గం లేదు తప్పించుకోవడానికి ..... ఎందుకంటే వాడు నా చెడ్డి దోస్త్ మరి.
      సరేరా ..... నువెవ్వరికి మన స్నేహితులకి చెప్పనంటే చెబుతా అని అన్నాను.  వాడు వెంటనే నీ మీద ఒట్టు ఎవ్వడికి చెప్పను అన్నాడు నాతోనే.  నా తల మీద చేయి వేస్తూ.....!

       " చెప్పు మామా ... చెప్పు ..... ఈ రోజు  కాలక్షేపానికి ఎమ్ లేదనుకున్నాను ..... నీ ప్రేమ కథ మరోసారి వినే అవకాశం దొరికింది నాక్కూడా .... అంటూ బాలు గాడు తగిలాడు.
                        " పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ రోజు చూస్తున్నట్టు వాడి సరదా".
           నిజానికి వాడికి నా లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం... ఇంతకముందే  వాడికి చెప్పి ఉన్నాను.  వాడూ ఎప్పుడూ ఆ విషయం మరిచిపోలేదు.  సమయం దొరికినప్పుడల్లా గుర్తు  చేస్తుంటాడు. ఈ రోజు మరో సారి సిద్ధం అయిపోయాడు వినడానికి.....నల్ల బాలు గాడు! నిజమే ఆ పేరు వాడికి చాలా బాగుంటుంది. నేను డిగ్రీ చదువుతున్న రోజులనుంచి వాడు నాకు పరిచయం. ఎంత దగ్గర వాడు అంటే మాత్రం నా దగ్గర జవాబు లేదు కానీ,  వాడు నాకు చాలా దగ్గర మనిషి అని మాత్రం నా మనస్సు ఎప్పుడూ చెబుతుంటుంది. నేను వాడిని అలానే పిలుస్తాను. నల్ల బాలూ అని, ముద్దుగా ! నిజానికి అలా పిలిస్తేనే నాకు ఎంతో హాయిగా ఉంటుంది. వాడి హాయి గురించి నేను  ఎన్నడూ ఆలోచించలేదు. ఎందుకో తెలుసా వాడు ఎందులో అయినా సంతోషాన్ని వెతుక్కునే రకం. వాడొక పెద్ద పిసినారి.  నిజంగానే వాడు చాలా పెద్ద  పిసినారి. మా ఊర్లో కోమిటి లచ్చన్న లాగ. కానీ ఇద్దరికి ఒకటే తేడా! లచ్చన్న ఎప్పుడు ఒకేలా ఉంటాడు, బాలు గాడు డబ్బులు తక్కువ ఉన్నప్పుడు  మాత్రమే అలా ఉంటాడు. ఏమైనప్పటికి వాడు మరో సారి నా కథ వినడానికి బస్సులో నా ముందు సీటు నుంచి 180 డిగ్రీలు వెనక్కి తిరిగి చాలా దర్జాగా ఒక చేయి సీటు వెనక భాగం మీద మరో చేయి నడుంమీద పెట్టుకొని కూర్చున్నాడు. వాడి పక్కన కూర్చున్నవాడు ఎలా అనుకున్నా పట్టించుకోకుండా.....!

                                    "నాకు బాగా గురుతు, అది నా ఇంటర్మీడియట్ అయినా తరువాత వేసవి కాలం. సాధారణంగా ఇంత వరకు వేసవి సెలవుల్లో ఎన్నడూ చదివింది లేదు. కానీ మొదటిసారి 2009 లో అదే నా ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసాక మాత్రం నాకా స్వేచ్ఛ లేకుండా పోయింది. నేను ఎప్పుడూ వెళ్లే సమ్మర్ క్యాంపు లక్షింపురం ఈ సారి దాదాపు రద్దయినట్టే అని అర్థమైంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ మధ్యనే ఏదో తెలుగు సినిమాలో వచ్చిన పాట మాదిరి "నెక్స్ట్ ఏంటి " (what next ) అనే ఆలోచన నాలోనూ, నా చుట్టూ వున్నా వాళ్ళనుంచి నాకు రావడం ప్రారంభం అయిన్ది. సో ఇక వేరే మార్గం లేదు. ఏదో  ఒకటి చేయాలి. ఎం చేయాలి? అప్పటికి నాముందు వున్న ఆప్షన్ ఒక్కటే.... అదే ఎంసెట్ కోచింగ్ కు వెళ్లడం!
                         
                                       ఎంసెట్ ఆ! అదేంటి? నువ్వు ఇంటర్లో ఎం పి  సి చదివావా? మధ్యలో బాలూగాడి చిరాకు పుట్టించే ప్రశ్న? నిజానికి వాడికి తెలుసు నేను ఇంటర్లో బై పి సి గ్రూప్ లో చదివానని. నన్ను ఆటపట్టించడానికి అలా అడగటం వాడి ఆనందమనే చెప్పాలి. కాకా కి నేను ఇంటర్ ఎక్కడ ఎప్పుడు ఏ  గ్రూపులో చదివానో తెలుసు. ఎందుకంటే వాడు నేను ఒకే కళాశాలలో ఒకే అకాడమిక్ సంవత్సరంలో ఇంటర్ చదివాము.

                                  "అరే బాలుగా నువ్వు నీ కంపు ప్రశ్నలు! ఆపుబే కొద్దిసేపు." అంటూ  కార్తీక్, బహుశా వాడు బాగా నా కథలో లీనమయ్యాడని అర్థమైంది. వాడికి సాధారణంగానే ఇలాంటి కథలు  అంటే బహు మక్కువ. అందునా నా స్టోరీ అంటే మరీ చెవులు కోసుకునే అంతగా వింటున్నాడు. అరే వీడి మాటలు నువ్ పట్టించుకోకుర కాకా, నేను రేపు కడప వెళ్ళాలి, నీతో ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటాను ! నో....  నో ..... ఒక్క రోజు కూడా కాదు ఈ రాత్రికి మాత్రమే ఉంటాను.  సో డోంట్ వేస్ట్ టైం విత్ నోయింగ్ ఫాక్ట్స్.... ప్లీజ్ గో టు యువర్ స్టోరీ? ప్లీజ్ " ఇదీ  వాడి ఉత్సాహం. కార్తీక్ మెల్లగా అడిగాడు ..... అస్సలు ఏమిటి విషయం కాకా అని.... బాలు గాడు చెప్పాడు నా స్వరాన్ని అందుకొని "అది ఒక పెద్ద కథ అని", పరవాలేదు చెప్పురా అన్నాడు కార్తీక్ ఒకింత ఆసక్తితో....! ఈ రోజు  నా సంతోషం  మరింత రెట్టింపు కావాలంటే అది చెప్పాలిసిందే అని నాకూ  అనిపించింది.
                       
                                  బస్సు కొద్ది సేపు ఆగింది. ట్రాఫిక్ సిగ్నెల్ అనుకుంటా, ఎక్కడికి వచ్చిందో అని కొంచెం కిటికీలోంచి తొంగి చూసా. పెద్ద తెలుగు అక్షరాలలో ఒక షాపుమీద 'అంతర్జాల కేంద్రం' అని రాసి ఉంది. ఇందులో విశేషం ఏముంది అనుకునేరు. ఆ పేరు తెలుగులో రాయడమే గొప్ప విశేషం. ఆ పేరుకి కిందనే NH 16, కంచరపాలెం అని రాసి ఉంది. ఆ షాపుకి అటు ఇటూ చూసాను, ఏ ఒక్కదానిపైన ఒక్క తెలుగు అక్షరము కనిపించలేదు. తప్పు లేదులే మనల్ని ఇంగ్లీషోళ్ళు పాలించారుగా అని సర్ది చెప్పుకున్నా నాకు నేను. సిగ్నెల్ పడింది.... బస్సు కదిలింది కొంచెం కుదుపుకుంటూ.... నా మాటలూ మెల్లగా సాగాయి. అయితే అందులో ఎటువంటి అనుకు బెణుకు లేదు, ఉన్నదంతా ఒక్కటే.....  అదే అంతులేని అనుభూతి! బస్సు మెల్లగా వేగం అందుకుంది నా మాటలతో సహా.  నా నోటంట పాదాలకి అంతు లేదు. వాళ్ళిద్దరికీ వినడం తప్ప మరో మార్గం లేదు. కోరి మరీ కెలికారుగా వినకేం చేస్తారు.

                                            అస్సలు నేను ఇంటర్ లో బై  పి  సి తీసిన సంఘటనే ఒక చిత్రంగా జరిగిపోయిన్ది. నేను మొదట ఎం పి  సి లో చేరుదామని అనుకున్నాను. కానీ నాకంటే మర్క్స్ లో ఇంకోకడు ఉన్నందున వాడూ అదే గ్రూపులో చేరినందున నేను ఈ గ్రూపులో చేరవలసి వచ్చింది. నిజానికి నాకు చాలా మంచే జరిగింది. ఎందుకంటే  నాకు మాథ్స్ అంటే సచ్చేంత భయం. కేవలం పేరు కోసం, గర్వంగా చెప్పుకోవడం కోసం అందులో చేరుదామని అనుకొన్నా! కానీ భగవంతుడు మంచే చేసాడనిపించింది. నాకు ఒక కారణం దొరికింది, ఎందుకు చేరలేదో చెప్పుకోవడానికి. కేవలం ఎం పి  సి కోసం వేరే ప్రైవేట్ కళాశాలలో చేరాలన్నంత కుతూహాలం ఎలానో నాకులేదు. సో ఫైనల్లీ ఐ జాయిన్డ్ ఇన్ బై పి  సి.  నీకు తెలుసు కదరా కార్తీక్  మన కాలేజీలో మెరిట్ వచ్చిన వారందరికీ ఎంసెట్ కోచింగ్ కి పంపుతారు సమ్మర్లో....
                    "హా .... యా యా .... ఐ రిమెంబర్ ఇట్.  నువ్వు అప్పుడు వెళ్ళావన్న  మాట. నౌ ఐ కం టు  నో సంథింగ్ క్లియర్లీ...   ఎనీవే ప్లీజ్ కంటిన్యూ కాకా.... "
                    నీకు బాగా గురుతుందరా కాకా!
                    వాడికి పెరికే పని ఏముంది గనకా .... బాలుగాడు సెటైర్ మళ్ళీ !
                    హా నిజమే అనుకో ..... నాకేం పెద్ద పనులేం లేవురా మరి!   మీరే ప్రపంచానికి గోచి కడుతున్నారు ప్రతిరోజూ .... ! ఒకింత వెక్కిరింపుతో కార్తీక్ సమాధానం.
                     సర్లే మామ నవీన్....  కానీయ్ ...... !

                    ఇంటర్ చదువుతున్నప్పుడు పెద్ద ఆసయలాంటివేం లేవు నాకు. మొదటి ఏడాదిలో పాస్ ఐతే చాలు అనుకున్నా. కానీ కష్టపడ్డాను. కష్టం ఊరికే పోతుందా! పోదు కదా..... ఎప్పుడూ పోదు. అది నేను కొత్తగా ఈ ప్రపంచానికి నేడు  నిరూపించవలసిన అవసరం లేదుగా! ఎంతో మంది ఎన్నోసార్లు సమయ సందర్భాలను అనుసరించి నిరూపించారు. ఒక రోజు మొదటి సంవత్సరం ఫలితాలు వెలువడ్డాయి. అనుకట్టుగానే మంచి మార్క్స్ వచ్చాయి. కాకపోతే రెండో స్థానం. మొదటి స్థానం నా మిత్రుడే. పేరు శంకర్. నాకు వ్యక్తిత్వ పరంగా చాలా నచ్చిన వ్యక్తి. తను వందశాతం ఆ స్థానానికి అర్హుడు. అందుచేత నాకేం భాద లేదు. నిజంగా ఆ వయసులో అదీ ఎంతో సరదాగా వుండే హాస్టల్ లో అలాంటి ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి ఉంటాడా అని ఆలోచిస్తే కచ్చితంగా ఆశ్చర్యం కలగకమానదు. మన ఎదుట లేని ఇంకో వ్యక్తి గురించి ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడకపోవడం అంత తేలికైన విషయం కాదు సుమీ. బట్ తను నిరూపించాడు.  నిజానికి ఇలాంటి విషయాల్లో ఆడవారికి ఆశక్తి ఎక్కువ అని అంతా అంటారు. నిజానికి మగవారేం తక్కువ కాదు. వీళ్ళకి కాలీ  దొరికితే వీరూ చేసేది అదే. కాకపోతే కుటుంబ పోషణకై పని చేస్తుంటారు కనక కాలీ సమయం దొరక్క మాట్లాడుకోరు అంతే . సమయం ఇచ్చి చూస్తే అంత  తేడా ఏమీ కనపడదు, కావాలంటే ఒక్కసారి గమనించండి. నా రెండు సంవత్త్సరాల్లో ఏనాడు  నేను శంకర్  నుంచి అలాంటి మాటలు వినలేదు. ఇంకా చెప్పాలంటే నేను అతన్ని పరీక్షించాను కూడా ఈ విషయంలో... కావాలనే ఇంకో వ్యక్తి గూర్చి తప్పుగా మాట్లాడాను, నిజానికి అది తప్పు కాదు, అంతా అనుకొనేదే... కాకుంటే అతడు అక్కడ లేడు . దానికి అతని సమాధానం చిన్న చిరునవ్వు. నాకు సిగ్గు అనిపించింది. ఈ ఒక్క విషయంతో అతనితో స్నేహం చేయాలనిపించింది. అది వెంటనే కాకున్నా కళాశాల నుంచి బయటకి వచ్చే సమయానికి పూర్తి అయింది.  తను నాకు దగ్గర స్నేహితుడు కాకపోయినా ఒక మంచి మిత్రుడు అని చెప్పగలను.
            "ఇదంతా ఎందుకు చెబుతున్నావ్.... నువ్ రెండో స్థానంలో నిలిచావ్ అని చెప్పడానికే గా ? అస్సలు విషయం చెప్పురా బాబు? కార్తీక్ గాడు ఒకింత అసహనంతో .....!

 పసిగట్టేసాడు.... నిజానికి నన్ను ఇంతలా అర్థం చేసుకున్న నా మిత్రులు ఎవ్వరూ నాకు ఇంటర్ లో లేరు. నా ఉద్దేశం కూడా అదే. ప్రత్యక్షంగా నేను గ్రూపులో సెకండ్ వచ్చానని చెప్పలేక ఇలా చెప్పాను. అంతమాత్రాన శంకర్ గురించి చెప్పిందంతా ఎంత మాత్రం తప్పు కాదు.
  నాకు అర్థమైంది. వాడు కోరుకుంటున్న కథా ఇతివృత్తం ఇది కాదు అని.
                                  ఈ కథ నాదిరా కాకి!  తొందరెందుకు.....? వాడిని కట్టడి చేయడం కోసం కొంచెం గద్గద స్వరంతో.... .  ఇలా  అయితే నేను చెప్పను అని అలిగినట్టు అన్నాను.
కార్తీక్ నే నేను పిలిచే మరో పేరు  "కాకి".  ఎప్పుడైనా వాడు మాట్లాడే మాటలు నా మనస్సుని నొప్పించినా, నన్ను ఇబ్బంది పెట్టినా నేను వాడిని అలానే సంభోదిస్తాను. పూర్ ఫెలో.... ఏమీ మనసులో పెట్టుకోడు. ఒకవేళ పెట్టుకున్న చాలా మృదువుగా చెబుతాడు.  ఇలాంటి దోస్త్ చాలా అరుదుగా దొరుకుతారు నిజ జీవితంలో అని నా అభిప్రాయం. ఇలాంటి ఒకరు ప్రతొక్కడకి ఉంటే చాలా బాగుంటదని నా అభిప్రాయం కూడాను. ఎంతటి భాదని అయినా పంచుకొనే అవకాశం,  అలాంటి సాన్నిహిత్యం ఉన్న వారివద్దనే సాధ్యపడుతుంది అంటే నమ్మండి.

                        ఏధైతేనేం రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టాను, ఎంతో ఆత్మ విశ్వాసంతో. నిజంగానే అదో వింతైన అనుభూతి. కానీ ఎక్కడో ఓ మూల  మొదటి స్థానం రాలేదే అనే ఫీలింగ్ వెంటాడుతున్నది. అలా ఏమీ లేదు అని అంటే అది అబద్దమే అవుతుంది. చదువుకి తోడు క్రికెట్టు క్రీడ తోడు అయిన్ది. మా గ్రూపు నుంచి కొద్దిమంది ఆశక్తి గలవాళ్లలో  నేనూ ఒకడ్ని. చాలా ఎక్కువ సమయం అది ఆడేందుకే కేటాయిన్చేవాల్లం. అల అలా సాగిపోతూ ఉంది సమయం. తూర్పున ఉదయించిన సూర్యుడు సాయంత్రం పడమరన అస్తమించినట్టు కాలం అంతే తొందరగా గడుస్తుంది. ఎంతో కాలం పట్టలేదు, ద్వితీయ సంవత్సర పరీక్షలు రావడానికి. అనుకున్నట్టుగానే వచ్చాయి. బాగానే రాసాను. కానీ ఈసారి స్దానం కోసం ఆశలేదు. అప్పుడు ప్రారంభమైంది నా ఎంసెట్ గోల .


                                " ఉమ్ ..... మరింకేం లేటు..... స్టార్ట్ చై ....!" బాలుగాడు ఎంతో ఉత్సాహంగా! చెప్పానుగా వాడికి నా కథ అంటే చాలా ఇష్టం. నా కథ  అని చెప్పడం కంటే వాడికి నేనంటే ఎంతో అభిమానం అని చెబితే బాగుంటుందేమో!

                 "ఏరా బాలూ .... అంత  ఉల్లాసంగా అడుగుతున్నావ్! అంత బాగుంటుందా వీడి కధ?    అయ్యో చంపేశావ్ మామ, బాగుంటుందని అని అడుగుతున్నావా.....?

    నన్నయ్య ఆంధ్ర మహాభారతాన్ని తెనింగిస్తూ ఏమన్నాడో నాకు తెలీదు గానీ, వీడి కథ మాత్రం మామూలుగా ఉండదు మామా.   అయినా నువ్వేం చెడ్డీ  దోస్తువుర బాబు. ఇంత వరకూ నీకు వీడు చెప్పలేదా!
       " లేదురా చెప్పలేదు. నాకూ అదే  అర్థం కావడం లేదు బాలూ. వీడు నాకు అన్నీ చెబుతున్నాడు అనుకున్నాను ఇన్నాళ్లు. కానీ వీడిలో ఈ కోణం కూడా ఉందని నాకూ ఈరోజే తెలిసింది. నానుంచి మాత్రం అన్ని విషయాలు రాబట్టుకుంటాడు, ఎప్పటికప్పుడు."
        బాలు : హా .... అవునవును! అది మాత్రం చాల తెలివిగా చేస్తాడు. వీడి బొక్కలు మాత్రం కప్పి పెట్టుకుంటాడు.

        రేయ్.....   రేయ్...... ఆపండ్రా ! సమయం దొరికితే చాలు.... అంతర్జాతీయ వెర్రిబాబుల సంఘానికి అధ్యక్షునిగా పోటీ చేస్తామంటారు, ఇద్దరూనూ ...... ! రేయ్ బాలు మైండ్ యువర్ టంగ్.
    బాలు : ఏం ? భయపెడుతున్నావా? నీ మాటలకి ఇక్కడెవడూ భయపడడు.... నీ చూపులకి ఎవడూ వనకడు కూడాను. పల్నాటి బిడ్డను రా నేను.

కార్తీక్   :   పొన్నూరులో పకోడెం కాదు. ఆపురా....  నువ్వూ ... నీ....  బా..... య్య  డైలాగులు. వినలేక చచ్చిపోతున్నాం.

        సర్లే......  సర్లే ...!   చెప్పు మరి.  మధ్యలో మమ్మల్ని  ఎందుకు అంత గొప్ప సంఘాలకి  అధ్యక్షుల్ని చేస్తావ్? కొంచెం బస్సు తప్పిన నవ్వు నవ్వుతూ  బాలుగాడి పలుకులు..... !

        నవీన్   :     అది సరే కాని బాలూ, మనం ఎక్కడికి వచ్చామో కొంచెం చూడు?

        బాలు :   దే....వుడ! అనకాపల్లి ఏంట్రా ఈ రోజు విశాఖకి ఇంత దగ్గరలో ఉంది. అప్పుడే వచ్చేసాం.
         రేయ్ .....!   లేవాండ్రా.... లేవండి,  వచ్చేసాం. మనం దిగాల్సిన చోటు వచ్చేసింది.
         కార్తీక్  :  అప్పుడే?
         బాలు : లేకపోతె..... పడుకోరా మరికొద్దిసేపు...... ఎలమంచిలి వస్తుంది.
       కార్తీక్ : ఎలమంచిలి ఎందుకులేరా..... ! మీ ఇంట్లో మంచం ఉంటే చెప్పు, నా శరీరం బాగా అలసిఉంది. ఇక్కడే ఒక సీను వేసేస్తా.

          కార్తీక్  :     ఏదిఏమైనా, నవీన్.... మై కాకా, మేరా దోస్త్...   చాలా బాగా చెప్పావ్ రా  నీ కథ. వెల్ ఐ యామ్ ఇంప్రెస్సెడ్ డార్లింగ్.... ఐ యామ్ ఇంప్రెస్సెడ్.
         బాలు : వాడేం చెప్పాడు..... నీకేం అర్థమైందిరా బాబు? ఇంతకీ అసల విషయం వాడేమన్నా చెప్పాడా?
          కార్తీక్ :     అవునురా...  నిజమే! ఇంత వరకు వాడు  చెప్పిన దాంట్లో వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదు మామ!
   బాలు : మరేం..... అది....  వాడి స్టోరీ టెల్లింగ్ అంటే.

    నవీన్ :       అరేయ్ బాలు ఆపర బాబు.... నీకు దండం పెడతా.! నువ్వు మొత్తం గాలి తీసేసేటట్టు ఉన్నవే!
   
                   చెప్పురా నవీన్?  కార్తీక్ మల్లీ అడిగాడు.  ఈ సారి కొంచెం నెమ్మదిగా!

                   రేయ్ నాకు చాలా ఆకలిగా ఉంది. బాలూ...  నువ్వు  రైస్ తొందరగా పెట్టు. అది ఉడికే సరికి బయటకి అలా వెల్లి ఏమన్నా తినొద్దాం.

                   "హా సరే మామ. వెయిట్ ఫర్ ఫైవ్ మినిట్స్. అరే కార్తీక్  నువ్వు  చెప్పరా? ఇంతక ముందు ఎప్పుడైనా అనకాపల్లి వచ్చావా? "
             "నేనా...  చాలా సార్లు వచ్చాను  బాలూ .....! కాకపోతే రైలు దిగలేదు. అందులోంచే మొత్తం పరిశీలించేవాడిని.  ఒకింత వెటకారంగా నవ్వుకుంటూ ..... !
           బాలు   : అబ్బో ....... చాలా ఉందిరా విషయం నీలో,
           నవీన్ : అందుకే వాడిని ఊరి నుంచి బయటకి గెంటేసార్రా బాలూ.
           బాలు :   అవునా! ఎందుకు మామ?
           నవీన్ : ఎం లేదురా... అవన్నీ చెప్పలేనులే నా నోటితో .... ! అస్సలే ఈ రోజు సోమవారమూను!
          కార్తీక్ : అరేయ్ .... చెబితే చెప్పు... లేకుంటే వూకో.
                       అయిన మధ్యలో ఆపుతావేంట్రా బాబు. వినేవారు ఏమనుకుంటారు.
         నవీన్ : హా .... ఏమనుకుంటారు?
         కార్తీక్ : అదే....  ఏమనుకుంటారు?
         నవీన్   :  మరేం అనుకోరులేరా ..... ! ఎప్పటికైనా సభ్య సమాజానికి తెలియాల్సిందేగా?
       
                  " అస్సలు ఏముందనిరా తెలియడానికి"
           బాలు : హా  హా  హా ..... సరేర.  అనకాపల్లి ఎలా ఉంది.

       "ఎం చుపించావన్రా ఇంతకీ... ఎలా ఉందో చెప్పడానికి?"

           నవీన్ : ఏముందర రాత్రి 8 గంటలు  అయిన్ది. అమావాస్య చీకటి కంటే పక్కన ఉన్న ఈ నల్ల బాలుగాడి  గాఢాంధకారం భరించలేకపోతున్నాం. "

       కార్తీక్ :  హ హ హ ..... నిజమే కాకా !

                                    ఆ తరువాత  ముగ్గురం అలా నడుచుకుంటూ  అనకాపల్లి మెయిన్ రోడ్డులో ముందుకు సాగాం. అనకాపల్లిలోనూ LED బల్బులు రోడ్డుమధ్యలో ఉన్న స్తంబాలకి మిరుమిట్లు గొలుపుతూ వెలిగిపోతున్నాయి. నేను ఇంతక ముందు వచ్చినప్పుడు అవి లేకుండే. గివెప్పుడు వేశారు మామా అని అడిగాను బాలు గాడిని.
                     " ఇవా....  మొన్నీమధ్యనే వేశారు మామా, బాబు వచ్చాక ఈ బల్బులు వేయడం తప్ప ఇంకేం చేసాడని గనక మన రాష్ట్రంలో... " వాడికి మన రాష్ట్రంలో ప్రస్తుత పరిపాలనా అంటే చాలా కోపం, చిరాకు కూడాను.

                      ఇంతకీ అనకాపల్లి ఎందుకు వచ్చానో  చెప్పనేలేదు కదా? బాలు ఇక్కడే ఒక ఇండియన్ ఆయిల్ బంకులో సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు. వాడిని కలిసి చాలా రోజులు అయిన్ది, ఒక్కసారి కలిసి  వెళ్ళిపోదామని ఇలా వచ్చాను. అనకాపల్లి చెరకు పంటలకు, అరటి తోటలకి బాగా ఫేమస్. ఇంతకముందు ఇక్కడ ఉండే బెల్లం గానుగు కర్మాగారం చాలా పేరు గాంచింది. ఇప్పటికీ అనుకోండి. కాకపోతే ఇప్పుడు అక్కడక్కడా మరికొన్ని వెలిశాయి. అటు శ్రీకాకుళం నుంచి ఇటు ఉభయ గోదారి జిల్లాల వరకు చెరకు పండించే రైతులు  దీని గురించి తెలియని వారుండరు అని చెబితే ఎంతమాత్రం ఆశ్చర్యం కాదు. నేను నా పాఠశాలలో ఉన్నప్పుడే విన్నాను మా సోషల్ టీచర్ నుంచి దీని గురించి.  కొంచెం పట్టణములో పారిశుధ్యం లోపించినప్పటకీ చుట్టూ ఉండే వాతావరణం మాత్రం అట్టే కట్టిపడేస్తుంది. నాకు చాలా ఇష్టం అనకాపల్లి అంటే.

                 సరేగాని కాకా ఏమైంది? చెప్పురా!
                                          ఆ .... ఎంతవరకు వచ్చిందిరా?

                  ఆ ..... అ! గురుతోచింది. "అప్పుడు ప్రారంభమైందిరా ఎంసెట్ గోల" అని చెప్పావు చివరిగా.
                   హా ..... ఓకే!
                   మాకు ఆ సంవత్సరం ఎంసెట్ కోచింగ్ విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఇచ్చారు. దాదాపు శ్రీకాకుళం, విజయనగరం రెండు జిల్లాల్లో ఉన్న రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థులంతా అక్కడకే రావాలి. అలానే వచ్చారు కూడాను. అన్నట్టు నా ఇంటర్ కళాశాల కేవలం బోయ్స్. బట్ కోచింగ్ లో మాత్రం అలా కాదు. రెండు రకాల కళాశాలల నుంచి స్టూడెంట్స్ వచ్చారు. అప్పటి వయసు ప్రభావం చేత ఉండే ఆకర్షణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనే అనుకుంటున్నాను. ఆకర్షణ అనేది సహజంగానే ఉంటుంది. అందునా నేను ఇంటర్లో చదివింది బయాలజీ.  కాబట్టి నాకు హార్మోన్స్....  వాటి ప్రభావం గూర్చి  కొంచెం బాగానే పరిచయం ఉంది.

                 రెండు అంటే రెండు రోజులు మాత్రమే ఇంటి వద్ద గడిపి 2009 మార్చి 26 వ తేదీన నా ఇంటర్ కాలేజీ హాస్టల్కి బయలుదేరాను. ఆ తరువాత రోజు అక్కడనుంచి పార్వతీపురం అంతా కలిసివెళ్ళాం.  అదృష్టమో లేక దురదృష్టమో తెలీదు కానీ, నా ఇంటర్లో ఉన్న దగ్గర స్నేహితుల్లో అతి కొద్ధి  మంది మాత్రమే ఈ కోచింగ్ కు ఎంపికయ్యారు. అందుచేత మిగిలనవారు పరిచయమున్నప్పటికీ అంత చనువు లేకపోవడం చేత కొత్తగా దగ్గరవ్వవలసింది. ఇది నాకు కొంత ఏకాంత సమయం కలిగేలా చేసింది. నిజానికి ఇప్పుడు అలోచించి చూస్తే అది మంచికే అనుకోవాలి సుమా.

                  దాదాపు రెండు జిల్లాల్లో ఏడు కళాశాలల నుంచి విద్యార్థులు వచ్చారు. అందులో సగం అమ్మాయిలూ ఉన్నారు. 28 వ తేదీ ఉదయం నుంచే అంతా కొత్త హడావుడి ప్రారంభమైంది. అప్పటికే ఒకరోజు గడవడం వాతావరణం కొంచెం పరిచయం అయినప్పటకీ ఇంకా తరగతులు ప్రారంభం కాలేదు. ఈ రోజే ప్రారంభం అవుతాయని ఆ కళాశాల కోఆర్డినేటింగ్ ప్రిన్సిపాల్ చెప్పారు. ఈ రోజు ఉదయమే తొందరగా మేల్కొని.... ("కొత్త ప్రదేశం కావున, అందునా కొంచెం ఎక్కువ మందే వచ్చారు కాబట్టి, ముందుగా లేచి దినసరి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే మంచిది అని ముందు రోజు రాత్రే అనుకున్నాను." )  అన్ని పనులు పూర్తి చేసుకొని అందరికంటే ఒకడుగు ముందరే ఉన్నాను. మొన్న సంక్రాంతికి అమ్మమ్మ తీసిన బట్టలు వేసుకున్నాను. ఇది మూడో సారి వేసుకున్నట్టు గురుతుంది. మొదటిసారి పండగ రోజు, రెండో సారి పబ్లిక్ పరీక్షల ప్రారంభ పరీక్ష రోజు, మల్లీ ఇదిగో ఇప్పుడు. ఏమైనా మా అమ్మమ్మ ఈసారి పండగకి మంచి బట్టలే తీసింది. స్నేహితులంతా షర్టు బాగుంది అంటుంటే.... గర్వంగా చెబుతున్నాను, మా అమ్మమ్మగారు తీసారని. ఒక్కసారిగా ఆమె మీద ప్రేమ, గౌరవం ఎన్నో రెట్లు అయ్యాయంటే నమ్మండి.  తన గురించి ఏం చెప్పినా సరిపోదు. ఆమె గంభీరం, ఆమె ఠీవి,  ఆ మాటల్లో స్పష్టత, ఏనాడు ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్ళలేదు కానీ, ప్రపంచ పర్యటన చేసిన వారి వాలే ఆమె పరిగ్యానమ్..... అంతా ఇంతా  కాదు. ఒకరకంగా చెప్పాలంటే మా ఊళ్ళో ఆడవారందరికీ ఆమె సలహాదారు. ఇలా ఆమె నాకు బట్టలు కొన్నందుకు మురిసిపోతూ ఆమె గురించి ఆలోచిస్తున్న సమయంలోనే టిఫిన్ బెల్ మ్రోగింది. నిజంగానే గంట కొట్టారు. ఆ శబ్దం చాలా గట్టిగా ఉంది, ఎంతలా ఉందంటే....  పార్వతీపురం అంతా వినపడేలా కొడుతున్నారేమో.... అని నా మిత్రుడొకడు ఛలోక్తి విసిరాడు. అంతా నవ్వుకున్నాం.... వెంటనే పరుగు కూడా తీసాం... చేతిలో కంచం పట్టుకొని.

                                 మొదటి రోజు టిఫిన్ వద్ద లైను కట్టాం. మాకు ఒక పది మీటర్ల దూరంలో అమ్మాయిల లైను కూడా ఉంది. వాళ్ళదీ అదే పరిస్థితి. స్త్రీ పురుష భేదం లేని సమాజం ఏర్పడిందని, లింగభేదాలు, అసమానతలు  ఇప్పుడు పూర్తిగా లేవని వాళ్ళని చూస్తే నాకు అర్థమైంది. ఈ విషయమే నా వెనుక ఉన్న సంతోష్ కి చెప్పాను. వాడి నుంచి సమాధానం లేదు. ఇంతకీ వాడు నా వెనుక ఉన్నడా! లేడా! ఒక్కసారి వెనక్కి తిరిగి చూసాను....  ఉన్నాడు.....  నా వెనకనే.....  కాకపోతే ద్రుష్టి అంతా ఎదురుగా ఉన్న వారిపైనే ఉంది.  నాకర్థమైంది వాడి పరధ్యానమంతా . వాడి నయనానందానికి ఆటంకం కలిగించ దలుచుకోలేదు. ఇంతలో కొన్ని మాటలు వినపడ్డాయి. " అరె నవీన్, నిన్న వచ్చింది మొదలు ఈ క్షణం వరకు ఎందుకొచ్చానురా బాబు ఇక్కడకి.....? మా ఊరిలో ఉంటే మంచిగా సమ్మర్ క్రికెట్ ఆడుకోవచ్చు ఈ కాలంలో ... అనవసరంగా వచ్చానా... ? ఈ ఎంసెట్ ర్యాంకు వచ్చేదా సచ్చెదా.  ఇప్పటికైనా మించి పోయిందెంలేదు, వెళ్లి పోదాం, మహా అయితే అమ్మ రెండు తిట్లు తిడుతుంది అంతేగా అనుకునేవాడిని " ఇది ఆ మాటల సారాంశం.  ఎవరో అనుకున్నారా? ఇంకెవరు.... వాడే... సంతోష్ గాడే....
        మరి ఇప్పుడేం అనుకుంటున్నావు రా.... అని అడిగా? ఏమీ తెలియనట్టు.
       " అస్సలు ఇప్పుడు ఇక్కడినుంచి  వెళ్లే పరిస్థితే లేదు. ఎవరేమన్నా...! ఏంజరిగినా సరే...!"
ఇది వాడి సమాధానం. నాకూ తప్పులేదనిపించింది. ఎందుకో తెలుసా....?  అక్కడ ఉన్న రంగు రంగుల ప్రపంచం అలా వుంది మరి. నిజానికి చలం గారి నవలలు అప్పటికే ఎవరన్నా చదివి ఉంటే ఆ నవలల్లో స్త్రీ పాత్రలు తప్పక గురుతొస్తాయని నా ఫీలింగ్. వీళ్ళని చూసే చలం  అలా రాసివుంటారంటావా నవీన్! నాకు నేనే ప్రశ్నించుకుంటున్నా? సంతోష్ గాడిని డిస్టర్బ్ చేయడం ఇష్టంలేక. లైన్ అలా ముందుకు జరిగింది. టిఫిన్ నా ప్లేటులో కూడా పడింది. నేను ఆ బేసిన్ వద్దకి రాగానే. అప్పటివరకు తెలీదు, ఆ రోజు అల్పాహారం ఉప్మా అని. పెద్దగా బాదేం లేదు. ఎందుకంటే మొదటి రోజు ఉండే ఉత్సాహం అలాంటిది మరి. ఫాస్ట్ ఫాస్ట్ గా పూర్తి చేసి ప్లేట్ అలా రూంలో విసిరేసి ఒక నోట్ బుక్ తీసుకొని బయలుదేరాం.... వడివడిగా.


                             మామా తిన్న తరువాత మల్లి చెప్పుకుందాం గాని.... అన్నం తిందాం.... ఇప్పటికే సమయం చాలా ఎక్కువయ్యింది. ఇది బాలు గాడి సంభాషణ.
                   
                             అప్పుడు గురుతొచ్చింది నాకు.... నేను ఉన్నది ప్రస్తుతం అనకాపల్లిలో కదా అని.
               కార్తీక్ : కర్రీస్ ఎమ్ తీసుకున్నావ్ బాలు?
               బాలు : హా .... మరేం పరవాలేదు లేదు లేరా. అన్ని వెజ్ కూరలే తీసుకున్నా. నువ్ సోమవారం నీసు ముట్టవంటగా.
             కార్తీక్  :  ఎవడు చెప్పాడు. అలా అని. నేను నాన్ వెజ్ తిననా....!
                           ఎంత మాట .... ఎంత మాట.
                           ఇది పొట్ట సమస్యే కానీ ...... పట్టింపు  సమస్య కాదే.
                            కాదు కాకూడదు.
                            ఇక సోమవారమే అందువా! ఇంట్లో వంటకు లేనిది వారానికేల పట్టింపు?
                            అయ్యో.... అయ్యో ....
                            ఎంత పని జరిగిపొయిన్దే ....!
                            చికెన్ లేదా?  ఎక్కడా .... ఎక్కడా లేదా!  కొంచెం కూడా లేదా?
                            అనకాపల్లిలో చేపలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయంటరూ?  కనీసం                                  అవన్న తీసుకోలేక పోయావా...!
                            పోనీ ..... గుడ్డు ?
                           ఎట్ లీస్ట్ అదన్న తీసుకున్నావా! హా .... తీసుకున్నావా ?
                            వాట్ .....!
                            అది కూడా తీసుకోలేదా....? చంపేశావ్ కదరా బాలు ?
                            అరేయ్ .... నవీన్ .....! నిన్నెరా.....
                            విన్నావా?  వీడేం చెబుతున్నాడో,
                            మనం మాటల్లో పడిపోతే, వీడేం కర్రీస్ తీసుకున్నాడో తెలుసా?
                       
                            ఒక పప్పు, కొత్తి మీర పచ్చడి, వంకైబటానీ కూర, పెరుగు .... ఇవేనంట ? అస్సలు ఎన్ వీ  తీసుకోలేదంట.

  నవీన్ :  అరేయ్ .... అరేయ్ ... తిండిబోతు ఆపారా నీ తిండి గోల.....! ప్రతిసారి నిరూపించుకోకురా?
                నేనే వద్దన్నాను.... మొన్ననే దసరాకి తిన్నాం కదా అని, మూడు రోజులు కూడా కాలేదు కదరా, అందుకే వద్దన్నాను.
              " వాట్? వద్దన్నావా."
       సరే లేరా .... ఇప్పుడేమైందని, మన ఉత్తరాంధ్ర స్పెషల్ వంకై బఠాణి ఉందిగా... సరిపోద్దిలే.
               " సర్లే ..... చికెన్ లేనిది ఏముంటే ఏమిటి... ఏదో ఒకటి. కానివ్వండి,
                 అన్నదాత సుకీభవ... నల్ల బాలు సుకీభవ"

                                   అలా ఏవేవో ఊసుల మధ్య మొత్తానికి పూర్తి చేసాం అన్నం తినడం. అప్పటికే చాలా ఆలస్యం అయిన్ది. సమయం దాదాపు 11 గంటలు కావొస్తుంది.  అనకాపల్లిలో బాలు గాడి రూమ్ పెంట్ హౌస్. రూమ్ ముందు విశాలమైన కాలీ ప్రదేశం. సింగల్ రూమ్ అయినా చాలా బాగుంటుంది. మేడ మీద నుంచి రాత్రి పూట అనకాపల్లి విద్యుత్తు బల్బుల కాంతుల్లో ఎంత మెరిసిపోతుందో.... నిజానికి ఈ ఊరు అచ్చమ్ ఒక అందమైన అమ్మాయి మెడలో హారం మాదిరి ఉంటదనుకోండి. టౌన్ కి ఒక వైపున జాతీయ రహదారి, మరో వైపున రైలు రోడ్డు.... ఆ రెండు ఈ ఊరికి రెండు వైపులా కలిసినట్టు ఉండడం.... దాదాపు అమ్మాయిల మెడలో  హారంలా ఉంటాడని నా అభిప్రాయం. మరో పక్క ఉన్న మెట్ట మీద ఉండే గుడి. దానిని దూరం నుంచి చూస్తే అచ్చమ్ నారదముని తలమీద ఉండే శిఖ మాదిరి కనిపిస్తుంది. ఆ గుడి అమ్మవారి దేవాలయం అని బాలు చెప్పాడు. అదంటే నాకు చేల ఇష్టం. కాకపోతే ఒక్కసారి కూడా వెళ్లలేక పోయా.

                           ఇంతక ముందు నేనెప్పుడు ఇక్కడకి వచ్చినా  కచ్చితంగా సినిమాకి వెళ్లే వాళ్లం బాలు నేను.  ఎక్కువగా రాజా పిక్చర్ పాలస్... అప్పుడప్పుడూ వెంకటేశ్వరా థియేటర్. రాజా థియేటర్ మాత్రం  మాకు  ఆస్థాన సినిమా హాలనే చెప్పాలి. దీనికి కారణాలు లేకపోలేదు. ఒకటీ ఎప్పుడూ మేము వెళ్లదలుచుకునే సినిమా అందులో ఆడటం, ప్రధాన రహదారి పక్కనే ఉండడం, టిక్కెట్స్ చాలా సులువుగా దొరకడం లాంటివి కారణాలు అనుకోండి. ఈసారి మిస్ అయినాం కదరా బాలు అని అంటే .... రేపు అన్నది మన కోసమే ఉంది మామా, ఎందుకు భాద పడతావ్ అంటాడు బాలుగాడు. పరోక్షంగా రేపు వెళ్దాంలే అని వాడి మాటల సారాంశం.
       
                         డాబా మీద కొద్ది సేపు అలా అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. కార్తీక్ కి ఇంకా అసహనం తగ్గి నట్టు లేదు కర్రీస్ మీద. బాలు గాడు రేపు తెస్తా అని మాటిస్తే గాని వాడు మామ్మూలు స్థితికి రాలేదు. వాడి ఇంత  అసహనానికి ఒకింత నేనే కారణం అని చెప్పాలి. వాడి మానాన వాడు విశాఖ నుంచి కడపకి వెళ్ళిపోతానంటే నేనే ఆశ చూపించి ఇక్కడకి తీసుకొచ్చా.   అలా ఏవో విషయాలు మాట్లాడుకుంటూ మెల్లగా  జారుకున్నాయి  మా మాటలు యధావిధిగా నా కధలోకి నాకు తెలీకుండానే.

                                  క్లాసు రూమ్ లోకి వెళ్ళాను. ఏ బెంచి మీద కూర్చోవాలి?ఏ వరుసలో కూర్చోవాలి? లోపలకి వెళ్లిన వెంటనే కొద్ది సేపు నిలబడి ఆలోచించా.! ఇంకా అప్పటికి ఎక్కవ మంది రాలేదు. కాబట్టి నాకు నచ్చే బెంచిని ఎంపిక చేసుకొనే అవకాశం ఉంది. అందుకే  కొద్ది సేపు నిల్చొని మొత్తం చూసాను.  నాకు ఎప్పటినుంచో రెండో నెంబర్ అంటే చాలా ఇష్టం. ఎందుకు ఈ నెంబరే ఇష్టం అని నాకు నేను చాలా  సార్లు ప్రశ్నించుకున్నాను. బహుశా అది చదువు విషయంలో యాదృచ్చికంగా జరిగిన కొన్ని సంఘటనల వల్లనేమో అనిపిస్తుంది. నేను నా పదో తరగతిలో మా పాఠశాలలో రెండో ర్యాంకు సాధించ. అప్పుడు నాది "బి" సెక్షన్. అది కూడా ఆంగ్లాక్షరాలలో రెండోదే కదా. నేను కూర్చున్న వరుస కూడా రెండో వరుసనే మా క్లాసులో. ఇంకా హాస్టల్ లో సెకండ్ రూం, అందులో గోడ పక్కనుంచి నా పెట్టే మళ్ళీ రెండోది. అలానే ఇంటర్లో నేను కూర్చునే బెంచి వరుస రెండోది. మొదట్లో దానికోసం పెద్ద పోటీ ఉండేది, మెల్లగా ఏదో చేసి అతి కొద్ది రోజుల్లోనే దానిని సంపాదించా అనుకోండి. మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో రెండో ర్యాంక్ వచ్చింది. సో రెండో సంవత్సరం హాజరు పట్టీలో మొదటి ఏడాది సాధించిన మార్క్స్ ఆధారంగా పేర్లు ఉంటాయి కాబట్టి మళ్ళీ అందులో నాదే రెండో స్థానం. ఇలా ఆలోచించి చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి. అందుకే నా మొదటి ఛాయిస్ రెండో వరసనే. కాకపోతే ఈ గదిలో రెండో వరస బెంచీ మరి బోర్డుకి దగ్గరగా ఉంది. పైన వున్న పంకా  గాలికి బోర్డు తుడిచే ప్రతిసారి ఆ సుద్ద పిండి మన మీదికే ఎగురుతుంది. సో సెంటిమెంట్ కంటే డస్ట్ లేకుండా చూసుకోవడం మంచిది అనిపించి ఈ రోజుకి మూడో వరుసలో కూర్చుందాం అనుకొని, ఆ వరుస బెంచీకి కుడి వైపున అంటే దారి పక్కన కూర్చున్నాను. వెంటనే తీసుకెళ్లిన రెండు పుస్తకాల్లో ఒకటి డెస్క్ లోపల పెట్టుకొని, మరోటి పైన పెట్టుకొని అందులో  ఒక రెండు పేజీలు తెరచి పెట్టి ఏదో చదువుతున్నట్టు ఒక పేస్ పెట్టి మొదటి రోజు క్లాసులోకి ఎంటర్ అవుతున్న మొఖాలను ఒకింత ఆసక్తితో చూస్తూ కూర్చున్నాను. నిజం చెప్పాలంటే ధ్యాస పుస్తకంమీద కంటే ద్వారబంధం వైపే ఉందంటే నమ్మండి.
                         
                                         క్రమంగా అంతా తరగతి గదిలోకి రావడం ప్రారంభించారు. అబ్బాయిలు మరియు అమ్మాయిలు. దాదాపు అరవై మంది వరకు ఉంటారు. అన్ని బెంచులు నిండినట్టే. సంఖ్యాపరంగా రెండు వర్గాలు సమపాలల్లో ఉన్నట్టు గమనించా.  సంతు నాకు మరో పక్క కూర్చున్నాడు. ఇంకేముంది మరో కొద్ది నిమిషాల్లో ఫస్ట్ పీరియడ్ బోటనీ ప్రారంభం అవుతుంది. మాకిచ్చిన పట్టికలో అదే ఉంది మరి. 

               అనుకున్నట్టు గానే బోటనీ లెక్చరర్ గంట మోగిన వెంటనే ప్రవేశించారు. కురుక్షత్ర యుద్దభూమిలోకి అర్జునుడు ప్రవేశించినట్టు, కాకపోతే అక్కడ పాల్గునిడి చేతిలో ధనుస్సు ఉంది ఇక్కడ గురువుగారి చేతిలో రెండు పాఠ్య పుస్తకాలు ఉన్నాయి.  కొంచెం ఉత్సుకతతో లేచి నిలబడ్డాం అంతా ఒక్కసారిగా.... గుడ్ మార్నింగ్ సార్ అనుకుంటూ....! ఒక్కసారి నా ఎలిమెంటరీ స్కూల్ గురుతొచ్చింది. కొద్దిసేపు పరిచయం చేసుకున్నాక మేషారు ఎంసెట్ పరీక్ష పద్దతి, బిట్స్ అడిగే క్రమం గురించి క్లుప్తంగా చెప్పసాగారు. అనంతరం పాఠంలోకి వెళ్లిపోయారు. ప్రతి పీరియడ్ దాదాపు గంట సమయం ఉంటుంది. కమొదటి రోజు కదా మెదడు పూర్తిగా ఇక్కడే నిమగ్నమవ్వడం వల్ల అనుకుంటా అంతా బాగానే బుర్ర లోపలికి వెళ్ళనట్టుంది. మరి కొద్ది సేపట్లో ఫస్ట్ పీరియడ్ పూర్తి కావొస్తోంది అన్న సమయంలో అనుకోని వింత, అస్సలు ఊహించని సంఘటన చోటుచేసుకుంది.  బోటనీ లెక్చరర్ క్లాసు చెబుతుండగానే మధ్యలో "మే ఐ కమిన్ సర్?" అనే శబ్దం. అందులోనూ ఎంతో మధురంగా. మొదట మేషారు తరువాత నేను నాతో పాటు స్టూడెంట్స్ అంత అటువైపుగా చూశాం.
                                        "ఆ క్షణం.... ఆ నిమిషం...  నా మదిలో చోటుచేసుకున్న వేవేల  ఊసులకి అక్షర రూపం ఇస్తే బహుశా  ఇలా ఉంటుందేమో అనిపించింది.
" విశ్వములో ఎక్కడో  ఉండాల్సిన ఒక అందమైన శకలం తన భ్రమణ మార్గాన్ని తప్పి  భూమి గురుత్వాకర్షణ శక్తికి లోనై ఇక్కడకి వచ్చేసిందా..... ?  లేక చంద్రుడ్ని ఇంకెంతమాత్రం ఉపగ్రహంగా ఉంచడం ఇష్టంలేక తనతోనే ఉండు అని భూమి చంద్రుడ్ని ఆహ్వానించిందా...?  నరలోకము....  దేవలోకము మరెంతమాత్రం వేరు వేరు కాదు అని ఇంద్రుడు నిర్ణయించుకొని  దేవ కన్యల్ని శాశ్వతంగా భూలోకానికి పంపించేసాడా? లేక  ఎంతో  మంది తెలుగు కవులు తమ  ప్రబంధ సాహిత్యంలో వర్ణించిన నాయికా మణులు ఒక్కసారిగా  మానవరూపం దాల్చారా?"

                        ఏం జరిగింది  ....!  అస్సలు ఏం జరిగింటుంది.
                        లేదు లేదు....  ఏదో అద్భుతం ఖచ్చితంగా జరిగేవుండాలి. లేకపోతె ఇంత అందం భూమి మీద ఒక్కసారిగా ప్రత్యక్షం అవ్వడమా! ఇంపాసిబుల్ ..... !" ఇలా ఉంది నా మనస్సులో ఆలోచనల సరళి. ఇంతకంటే ఎక్కువనే చెప్పాలి నిజానికి.  బహుశా నాకు తెలుగు పదాల మీద అవగాహన అంతగా లేకపోవడం వల్ల ఇంకా బాగా రాయలేకపోతున్నానేమో! అనిపిస్తుంది.

                        అలానే ఉండిపోయా కొద్దిసేపు. ఈ వూసులు నాకేనా! లేక అందరూ నాలానే ఫీల్ అవుతున్నారా? కొంచెం నా మిత్రులని కూడా పరిశీలిద్దాం అనుకున్నా. కానీ నా మైండ్ మాట నా కళ్ళు వినే పరిస్థితిలో లేవు. ప్రయత్నించాను...  కానీ అస్సలు కావడం లేదు. ఇక నావల్ల కాదని అర్థమైంది. అందుకే చివరిగా కళ్ళ మాటనే ఫాలో ఐయ్యాను. అప్పటికే క్లాసులో ఉన్న చాలా మంది అమ్మాయిలని చూసాను, కొత్తగా  ఏమీ అనిపించలేదు. బట్ ఈమె అలా లేదు. "చుట్టూ ఉన్న గాలిని అకస్మాత్తుగా ఎవరో బంధించినట్టు, అప్పుడే ప్రారంభం అవుతున్న వేసవి ఉన్నట్టువుండి శీతాకాలంగా మారినట్టు, పార్వతీపురం కాస్త పారిస్ గా మారినట్టు అనిపించింది. ఒక్కసారిగా కిటికీ లోంచి ఒక పిల్లగాలి నెమ్మదిగా నన్ను తాకుతూ, నా మనస్సులో కలిగిన ఈ అకస్మాత్తు భావాలను తీసుకొని ద్వారంవైపు ప్రయాణించడం ప్రారంభించింది. నన్ను తాకిన ఆ గాలే తననూ తాకుతూ బయటకి వెళ్ళిపోయింది.   అదే గాలికి ఆమె నుదిటి మీదికి జారిఉన్న ఆమె ముంగురులు కాస్తా యధాస్థితికి చేరుకున్నాయి. నా ధ్యాస కాస్తా ఆమె కళ్ళ వైపు మరలింది మెల్లగా... ఇంతక మునుపెన్నడూ అంత ఆకర్షణీయమైన నయనాలని నేను చూసిందిలేదు. ఇంత బాగున్నాయేంటి ఈ కళ్ళు. కనురెప్పలు కొంచెం కాటుక రాసి ఉన్నట్టు ఆ చుట్టు ఉండే తెలుపును కాదని మెరుస్తున్నాయి. ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఆడవాళ్లు కాటుక రాస్తారో.  కొంచెం ఇలా కూడా ఉంటాయా అని లోలోపల ఒక ప్రశ్న? అక్కడ నుంచి జరగడానికి నా నేత్రాలకి కొంచెం ఎక్కవ సమయమే పట్టింది అని చెప్పడానికి నాకు ఎటువంటి మొహమాటమూ  లేదు సుమీ.  ఆ రెండు కళ్ల మధ్యలో ఉన్న కాలి నుదిటి స్థలాన ఒక చిన్న బొట్టు. అదికూడా మిరుమిట్లు గొలిపే ఒక అద్భుతమైన పొడిని కలిగి కాంతితో కలిసి మెరుస్తుంది. ఆ నుదురు, దానిని కావాలనే కప్పుతున్నట్టు ఉండే  నల్లని ముంగురులు, సప్తమి నాటి సగం వెన్నెలలా ఉన్న ఆ చెక్కిళ్ళు, శిల్పానికి  చెక్కినట్టు ఉండే ఆ మెడ, దానికి మరింత సోయగాన్ని జోడిస్తూ ఉండే బంగారం రంగు చైను,  కొంచెం కొనదేలినట్టు ఉండే ఆ ముక్కు, దాని కింద కొంచెం లేత ఎరుపు రంగులో ఉన్న పెదాలు,  ఒకటా రెండా ..... దేని గురించని చెప్పను. నిజానికి ఆమె స్వరూపాన్ని దేనితోనూ పోల్చి చెప్పడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. అలా చెబితే ఆమె సౌందర్యాన్ని తక్కువ చేసినట్టే అవుతుంది. శ్వేతవర్ణంలో ఉన్న డ్రెస్సు మీద అక్కడక్కడా పువ్వుల డిసైన్ తో కూడిన  పంజాబీ డ్రెస్సు ధరించి ఉన్న ఆ నిలువెత్తు రూపం ఇప్పటికీ నా కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది అనుకో.  కాదు కాదు ... ఎప్పటికి నా కంటి పొరల్లో చిక్కుకొని  ఉండిపోయే లావణ్యమైన రూపం అది. కిన్నెరసాని ప్రవాహాన్ని సహితం వెనక్కి నెట్టే విధంగా ముందుకు అడుగులు వేయడం ప్రారంభించింది. ఆ అడుగుల్లో చిన్న మువ్వల శబ్దం... బహుశా ఆమె కాలి గజ్జల శబ్దం అనుకుంటా...! ఇప్పుడర్థమైంది కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు కిన్నెరసాని పాటలు ఎందుకు రాసారో...!


                     "ఈమె నాకు పరిచయం ఐతే బాగున్ను, అసలు  ఈమె నా పక్కనే, నాకు అతి దగ్గర్లో కూర్చుంటే బాగుణ్ణు అనే ఆలోచన వెనువెంటనే కలిగింది. అది  జరిగే పనేనా...! నాకంత అదృష్టం కూడానా?!  ఎందుకుండకూడదు??  నాకేం తక్కువ గనక?"  నాకు నేనే సమర్ధించుకుంటున్నాను అని అర్థమైంది." బహుశా విష్ణుమూర్తి నా మనసు గొడవ విన్నట్టు ఉన్నాడు. ఎందుకు విష్ణువే అంటున్నానంటే,  నాకు బాగా గురుతు మా తెలుగు మాష్టారు స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి చెప్పాడు .....

                                 " సృష్టికర్త బ్రహ్మ అట
                                    నడిపించేవాడు విష్ణువట
                                    లయకారుడు పరమ శివుడని".   
                    అందుకే అన్నాను విష్ణువు నా మనసు ఊసులు విన్నాడేమో అని. లేకపోతె మరేంటి. అచ్చమ్ నేను కోరుకున్నట్టే జరగడమేమిటి. ఇసుమంత  కూడా తేడా లేకుండ.  ఆమె అడుగులు మెల్లగా నావైపే పడసాగాయి.  నా గుండె మరింత వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. చెప్పడానికి జర సిగ్గుగా ఉంది గాని నా శరీరంలో వొకింత వణుకు కూడా ప్రారంభమైంది. జరిగింది.... అంతా అనుకున్నట్టే జరిగింది. ఆమెనే ... అవును నిజం...  తనే... నేరుగా వచ్చి  నా పక్కనే.... నాకు అతి దగ్గర్లోనే కూర్చుంది. ఎమీ అర్థం కాలేదు, ఇదంతా నిజమా?  అంతా  క్షణాల్లో జరిగిపోయిన్ది అంటే నమ్మండి. అంత వరకు ఆమెను చూసిన నా నేత్రాలు ఇప్పుడు ఆమెను చూడాలంటే భయపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆమె నాకు అతి చేరువలో ఉంది, నా పక్కన ఉంది.  కొద్దిసేపట్లో నా శరీరం నా గుప్పిట్లోకి వచ్చింది. అప్పటివరకు ఉన్న చిన్న చిరు చెమట మెల్లగా మాయమైపోయిన్ది. గురువు గారు యధావిధిగా లెక్చర్ ఆరంభించారు. అర్థం కావడం విషయం దేవుడెరుగు, నాకేమి వినిపించడం లేదు. మొదటిసారి వినికిడి లోపం కలిగిందా అన్న సందేహం. నా మెదడు సంకేతాలకి మెల్లగా నా  మనసు స్పందించడం ప్రారంభించింది. నేనొక సంభ్రమాశ్చర్యంలో ఉన్నానని అవగతం అయింది. మెల్లగా నా గుండె స్పందన  సాధారణ  స్థితికి చేరుకుంది. ఇప్పుడు తనని చూడాలంటె నా కళ్లని కనీసం 45 డిగ్రీల కోణంలో అయినా తిప్పక తప్పదు.  కొంచెం భయంగానే ఉన్నా ఓ ప్రయత్నం అయితే చేశా. కానీ లాభం లేదు. పూర్తిగా తలని తిప్పి చూద్దామంటే ధైర్యం సరిపోవడం లేదు. మొదటి రోజు మొదటి తరగతిలో అవమానపాలు అవుతానేమో అని భయం. నాకు మొదటే ఆడవాళ్ళతో మాట్లాడాలంటేనే ఏదో తెలియని ఇన్ఫిరియారిటీ. అదీ కాకా నా ఇంటర్మ విద్యాభ్యాసం అంతా బోయ్స్ కళాశాలలో జరగడం కూడా మరో కారణం అని చెప్పవచ్చు. అది కాక అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడకపోయిన వాడు మంచివాడు అనే ఒక దిక్కుమాలిన భ్రమ కూడా లేకపోలేదు. అందుకే అన్నాను ఇది ఒక మధ్యతరగతి మనస్సు అని. ఇవి కాక మనస్తత్వ శాస్త్రంలో అలాంటి ఒక న్యూనతా భావానికి అనేక కారణాలు ఉన్నాయని..  వాటిని అధిగమించే మార్గాలు కూడా ఉన్నాయని అక్కడకి చాలా సంవత్సరాల తరువాత తెలిసింది.

                                     ఏధైతేనేం అతి కొద్ధి సమయంలోనే మొదటి పీరియడ్ పూర్తయి రెండో పీరియడ్ మాష్టారు రావడానికి ముందు కొంచెం సమయం దొరికింది. ఇక ఎంత మాత్రం ఉండలేక ఒక్కసారి కంటికింపుగా చూద్దామని, వీలైతే మాట్లాడదామని చాలా గట్టిగా  అనుకొని తన వైపు చూసాను. తనను అంత దగ్గరగా అయితే చూడగలిగాను కానీ, నోట మాట రావడం మాత్రం ఆశ గానే మిగిలింది. ఈ రోజు వీలుచిక్కినప్పుడల్లా ఒక చిన్న చూపుతోనే నేను పొందిన ఆనందం అంతా ఇంత కాదు. నిజానికి తను ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు ఆ తదుపరి రెండు గంటల సమయంలో.... నిజానికి తను ఎవరితోనూ మాట్లాడలేదనుకోండి. నేను మాత్రం నా అభిలాషని సంతు గాడికి ఏదో ఒకరకంగా చెబుతూనే ఉన్నాను, బట్ వాడు చాల సాధారణంగా తీసుకొనేవాడు. ఎందుకంటే వాడికి అమ్మాయిలతో మాట్లాడటం చిటికెలో పని. నిజానికి వాడు అందులో ఎక్సపర్ట్ అనే చెప్పాలి. అందుకే వాడికి నా మనసు గందరగోలం ఏ మాత్రం కొత్తగా అనిపించలేదు.  పరిచయం లేని కొత్తవాళ్లతోను, అందునా అమ్మాయిలతోను మాట్లాడటం కూడా ఒక కళేనేమో అనుకున్నాను.  అన్నట్టు...  మొదటి యాబై నిమిషాల లెక్చర్ తప్ప మరేది నా బుర్రకి  పట్టలేదు.  ఆ తరువాత జరిగిన రెండు క్లాసుల్లోను అదే  పరిస్థితి. సాధారణంగా ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు, వారు చెప్పేది మనకి అర్థం కానప్పుడు, మన ఆసక్తి వేరే దగ్గర ఉన్నప్పుడు, మనలో ఒక విధమైన చిరాకు, అసహనం కలగడం పరిపాటి. కానీ ఈ రోజు నాలో అలా లేదు. మనసంతా ఎదో తన్మయత్వంతో నిండిపోయిన్ది.  నా చుట్టూ జనం ఉన్నా నేను మాత్రం ఏకాంతంలోనే ఉన్నాను, నా కళ్లెదుట అనేక విషయాలు చెబుతున్నప్పటికీ అవేవి నా కనుపాపని దాటి లోపలికి వెళ్లలేదనే చెప్పాలి.  ఇంతలోనే మధ్యాహ్నం భోజనం సమయం వచ్చేసింది. అదేంటి ఇప్పుడే కదా టిఫిన్ చేశాం, ఇంతలోనే మళ్ళీ విరామమా? అనిపించింది. తన కంటే నేనే ముందుగా లేచి బయటకి వచ్చేశా.

                              భోజన విరామంలో అందరితో పాటే అడుగులు వేస్తున్నానే గాని, మదిలో మాత్రం ఒక నిర్దిష్టమైన ఆలోచన నడుస్తునే ఉంది. అమ్మాయిని చూడటం ఇది మొదటిసారి కాదు. నా ఈ చిన్న జీవితంలో ఇద్దరమ్మాయిలని ఒకింత అభిమానంతో చూసిన సందర్భమూ లేకపోలేదు. కానీ ఇంతలా ఎప్పుడూ లేదు.  నా గత అనుభవాలు ఒక్కసారిగా కళ్ళముందు అలా కదిలాయి.
                              మొదటిసారి నా ఏడో తరగతిలో అనుకుంటా....  "కవిత" అనే అమ్మాయిని   చూడటం, నచ్చడం జరిగింది.  ఆ అమ్మాయి అందం, శరీర సౌందర్యం కంటే ఆ పేరుకే మొదట అభిమానినైపోయాను. తనతో ఎంతో ఆశక్తితో మాట్లాడటం, అప్పుడప్పుడూ ఒక వింతైన అభిలాషతో చూడటం, గొడవపడటం, లెక్కలు చెప్పించుకోవడం చేస్తూండేవాడ్ని. వయస్సు చాలా చిన్నదని తెలుసు. అప్పటికి హార్మోన్స్ ప్రభావం కూడా ఏమి లేదు. తనతో మాట్లాడాలనే ఒక కోరిక తప్ప. ఏమైతేనేం నాకు నా ఎలిమెంటరీ స్కూల్లో ఒక జ్ఞ్యాపకం ఉందనే చెప్పాలి. దానికి ఎటువంటి రుచి లేదనే చెప్పాలి. ఏడో తరగతి పూర్తైన తరువాత నా స్టడీస్ కోసం నేను, తన దారి తనదిగా వేరుపడ్డాం. ఆ తదనంతరం మళ్ళి తననెప్పుడూ చూడకపోయినా ఇప్పటికి తనంటే నాకు గురుతే, అభిమానం కూడాను. అప్పుడు నాతో చదివిన వారెవ్వరు కలిసినా  తన గురించి వాకాబు చేయడమనేది ఒక సాధారణ విషయం.

                              అనంతరం పదో తరగతిలో కూడాను అచ్చమ్ ఇలాంటి సంఘటనే మళ్ళీ చోటుచేసుకుందంటే నమ్మండి. ఈ సరి పేరు "వెంకటలక్ష్మీ". అమ్మాయి చూడడానికి మరీ అంత తెల్ల తోలు గలదెమ్ కాదు. సాధారణంగా తెలుపుని అందం అనుకొనే వయసది, కాబట్టి అలా అంటున్నా.  కొంచెం చమనఛాయ రంగు. అయినప్పటకి ఎంతో కలైన మొఖము, కలివిడి తనము, అందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడే గుణము, చదవడంలో ముందు ఉండటం తన గురించి నన్ను ఆలోచించేలా చేశాయి. చిత్రమేమంటే నేను తనని ఎనిమిదో తరగతి నుంచి చూస్తున్నాను. ఎప్పుడు ఇలా అనిపించలేదు. కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. తొమ్మిదో తరగతి పరీక్షలు పూర్తై వేసవి సెలవులకి ఇంటికి వెళ్లడం, యాబై రోజుల సెలవులు గబ గబా గడిచిపోవడం నేను పదో తరగతిలోకి ప్రవేశించడం చక చకా జరిగిపోయాయి. ఇప్పుడు తను మునుపటిలా లేదు. అప్పటి వెంకట లక్ష్మి కానే కాదు. ఇంత తక్కువ సమయంలో ఇంత మార్పేంటో నాకర్థం కాలేదు, అక్కడకి కొద్ది రోజుల్లోనే బయాలజీ మాష్టారు పాఠం చెప్పినంతవరకు. అంత హార్మోన్స్ ప్రభావం అని, బయోలాజికల్ చేంజ్ అని. ఈ ప్రభావం నామీద మాత్రమే కాదు, నా మిత్రులు శ్రీను, సిద్దూ, అశోక్ అందరి మీద పడింది. నాకు స్పష్టత వచ్చింది కొన్నాళ్ళకి  ఆకర్షణ అంటే ఏమిటో. తనతో మాట్లాడాలని ఎప్పటికప్పుడు  ప్రయత్నిస్తూనే ఉండేవాడిని. స్కూల్లో ప్రతిరోజూ ఉదయం ప్రార్ధన నేనే చేయించడం వల్ల.... దాదాపు ప్రతి రోజు "మాతెలుగు తల్లి" పాడేందుకు తననే పిలిచేవాడిని. సాధారణంగా ముగ్గురు అమ్మాయిల్ని తెలుగు తల్లి  పాట పడేందుకు, ఇద్దర్ని "వందేమాతరం" పడేందుకు, ఒకర్ని "ప్రతిఙ" చెప్పేందుకు పిలిచేవాడిని. నాకిష్టమని తనని పిలవడం కాదు గాని తన స్వరం చాలా బాగుంటుంది. అందువల్ల ఎవరు అనుమానించడానికి వీల్లేకుండా ఉండేది. లేదంటే ఒక్కర్నే ప్రతిరోజూ పిలిస్తే మా సైన్స్ టీచర్ వెంటనే అడిగేసేది. ఎంతైనా సైన్సు టీచర్ కదా, ఇట్టే పసిగట్టేసేది, మా వేళాకోలాలు. కానీ నాకా పరిస్థితి ఎదురుపడలేదు. అంతా దసరా సెలవులకి ఇంటికి వెళ్లినంత వరకు బాగానే ఉండింది. అప్పటికే చాలా మంది దాదాపు నలుగురం నాతో కలిపి ఆమె ప్రేమ కోసం ప్రయత్నిస్తుండేవాల్లం. ఒకరికి తెలీకుండా ఒకరం. నిజానికి అది ప్రేమ కాదు పాలకూర కట్ట కాదు. బయాలజీ మాష్టారు చెప్పినట్టు హార్మోన్స్ ప్రభావం అంతే. నాకైతే స్పష్టంగా తెలుసు. కానీ అలా ఆమెతో మాట్లాడటం కోసం చేసే ప్రయత్నంలో ఏదో మజా ఉందని అనిపించేది. అందుకే అలానే ఉండేవాడిని.
              దసరా సెలవులు పూర్తై మరల స్కూలుకి వచ్చాను. వచ్చిన మొదటి రోజే ఊహించని షేక్ ఎదురైంది. ఏమైందనుకుంటున్నారు.... ఎలా జరిగిందో జరిగింది, ఏం చేసాడో కానీ చేసాడు... ఇంత వరకు వెంటపడుతున్న శ్రీను, సిద్దూ,  అశోక్, నేను ఎవ్వరూ కాదు. అస్సలు ఎప్పుడూ ఊహించని వ్యక్తి తెరమీదకి వచ్చాడు. వాడే  రాస్కెల్  రోహిత్ గాడు. వాడంత  అందమైనవాడేం కాదు, పోనీ చాల కలివిడిగా ఉంటాడా అంటే అదీ లేదు. కొంచెం  బాగా చదువుతాడని కొంచెం పేరుంది.  అయినా అదే నిజమని నిర్ణఇంచడానికి లేదు.  ఇది ఇంకా పదో తరగతి  ప్రారంభం మాత్రమే... మొన్న సెలవులకి ముందు రాసిన క్వర్టీయర్లీ పరీక్షల ఫలితాలు కూడా ఇంకా రాలేదు.  కానీ ఎదో చేసాడు రాస్కెల్. ఎం చేసాడో తెలీదు. మా నలుగురికి దిమ్మ తిరిగిపొయిన్ది అనుకోండి. అంతటితో వదల దలుచు కోలేదు మేము. ఆంగ్లంలో అదేదో "ఇగో" అంటారు కదా!
                          ఇగోనా ....?   అంటే ...... " అహం " అనుకుంటా  ...!  బాలు కొంచెం సందేహంతో...
                          హ ...   కరెక్ట్ ... యూ ఆర్ రైట్.
అదే మాకు కలిగింది. కలిగింది అనే దానికంటే ఒకింత ఎక్కువ  అయిందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తిలోనూ ఒకస్థాయి మేరకు అహం అనేది సాధారణంగా ఉంటుంది.  అందుచేత ఎలా  అయిన  వాళ్ళని విడగొట్టాలని ప్రయత్నించాం. పోనీ నేను వదిలేద్దాం ఆ విషయం అనుకుంటే మిగిలిన ముగ్గురూ వదలడం లేదే. ఎంతటి ఐక్యమత్యమో చూడండి. ఇంతకముందు మేము నలుగురం ఆ అమ్మాయి వెనక తిరిగినప్పుడు ఒకరికి ఒకరం చెప్పుకొనేవాళ్ళం కాదు. కనీసం మాట్లాడటం సహితం అంతంత మాత్రమే. ఎప్పుడైతే వాడు ఆ అమ్మాయి విషయంలో మమ్మల్ని వెనుకకు నెట్టి ముందుకు వెళ్ళాడో, మామధ్య ఎటువంటి దాపరికాలు లేకుండా ఒక్కసారిగా ఐక్యమత్యం వచ్చేసింది. ఇలాంటి ఐక్యమత్యమీద బాధపడాలో సంతోషించాలో అర్థం కాలేదు ఆ వయస్సులో.  రాస్కెల్ ఎం చేసాడో తెలీదు. మా వేంకటలక్మి ఇక వేరేవాడి ప్రియురాలి అనే విషయం జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఏది ఏమైనా చివరికి విఫలమయ్యాం. వెల(వెంకటలక్ష్మి)ని వాడి నుంచి విడదీయలేకపోయాం.  "వెల"  మేము పెట్టుకున్న ముద్దుపేరు వెంకటలక్ష్మికి. ఇది తెలిసిన మరో కొద్ది రోజుల్లో పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. అనుకున్నట్టుగానే ఆ రోహిత్ గాడు మొదటి స్థానం సంపాదించాడు. అప్పుడు అర్థమైంది, ఎందుకు "వెల" వాడితో కనెక్ట్ అయిపోయిందో. కానీ దీనివల్ల నాకు జరిగిన ఒకే ఒక్క మంచి విషయం ఏమిటంటే నాకు స్టడీస్ లో పోటీ లేకుండా అయిపొయిన్ది. ఎందుకంటే వెలతో ప్రేమలో పడ్డాక రోహిత్ గాడి ప్రాముఖ్యతలన్నీ మారిపోయాయి. నాకు మళ్లీ అలాంటి పరిస్థితి రాలేదు. ఫలితం ఏమిటంటే నేను నా పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో స్కూల్లో రెండో ర్యాంకు సాధించడం. నేను ఈ విషయంలో వాడికి రుణపడివున్నాను. అన్నింటికన్నా ఆనందదాయకమైన విషయమేమంటే ఇప్పటికీ వాళ్లిద్దరూ కలిసిఉండడం. మొన్నీమధ్యనే ఆ విషయం నాకు ఒక మిత్రుడి ద్వారా తెలిసింది. ఈ విషయం విన్న తరువాత చాలా సంతోషించాను. ఏమైనా సరే వెల సంతోషంగా ఉంది అదే చాలు.

                       ఇంతలో భోజనం కోసం కళాశాల వరండాలో మిత్రులతో కలిసి కూర్చన్నాను. మొదటి రోజు తను ఒక్కర్తే నడుచుకుంటూ నా కళ్ల ముందు వెళ్లడం, ఈ సారి నా ద్రుష్టి ఆమె జడ మీద పడింది. అంత పొడవేమిట్రా బాబు అనిపించింది. ఆ నెమ్మదయినా నడకకి ఆ జడ మరింత అందాన్ని చేకూర్చిందంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. నా చూపు అంతా తనవైపే, తన చూపు ఎప్పుడు నా వైపు పడుతుందా, ఎప్పుడు మాట్లాడుతుందా అనే ఆకాంక్ష లోలోపల తీవ్రంగా బలపడుతుంది.  తన పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చింది?  బాగా చదువుతుందా? నేను మాట్లాడితే మాట్లాడుతుందా? తన ఇష్టాలేంటి? ఇలా సాగాయి నా మనసులో వివిధ రకాల ప్రశ్నలు. మొదటి  రోజు అలా గడిచిపొయిన్ది. ఒక్క మాటా లేదు. నేను చూడటం మాత్రమే తప్ప తన నుంచి ఎటువంటి జవాబు లేదు. సంతుగాడు నాకు ధైర్యం నింపే ప్రయత్నం చేసాడు.

                        రెండో రోజు ప్రారంభమైంది. ఈ రోజు ఎలా అయినా తనతో మాట్లాడాలని ఉదయం లేచిన దగ్గర నుంచే ఆలోచించడం ప్రారంభించా.  కానీ ఎలా. ఎంత ఆలొచించిన ఏమి పాలుపోవడం లేదు. చివరికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటో తెలుసా... ఏదైనా ఒక పుస్తకం తీసుకోకుండా క్లాసుకు వెళ్లాలి. తనని ఆ పుస్తకం అడగాలి. ఈ వంపు ద్వారా అయినా తనతో మాట్లాడాలి. అనుకున్నట్టే క్లాసుకు వెళ్ళాను. మొదటి పీరియడ్ పూర్తి అయింది. అనుకోకుండా రెండో పీరియడ్ మాష్టారు రాలేదని, మీకు నచ్చిన సబ్జెక్టు తీసి చదువుకోండని సార్ చెప్పాడు. సమయం దొరికింది. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకూడదని చాలా ధైర్యం చేసి నా పెదాలు తెరిచాను. నా మొట్ట మొదటి మాటలు ఇలా సాగాయి.

       ఎక్స్ క్యూస్ మీ..... 'తను పలక లెదు.
       హలొ .... ఎక్స్ క్యూస్ మీ ....!
        "హ .....!  ఏంటి. ?"
       తన వద్ద అన్ని పుస్తకాలూ ఉంటాయి. సో....  కాదు, నా వద్ద లేదు.... అనే జవాబు తన వద్ద నుంచి రాదని నాకు తెలుసు. అందుకే అడుగుదాం  అనుకున్నా. ఒకవేళ తాను లేదంటే?  నో నో... అలా అనదు. ఒకవేళ అలానే అన్నదనుకో తన నేచర్ కూడా తెలుసుకొనే అవకాశం వస్తుంది.         
        ఎం లేదు. నేను ఈ రోజు బోటనీ బుక్ తీసుకురాలేదు. కొంచెం మీ బుక్ ఇస్తారా?
          " హ .... సరే... ఇదిగో " అని ఇచ్చింది.  ఆ మొఖంలో ఎటువంటి కవళికలు నేను గమనించలేదు. నేను ఒకింత అసహనానికి గురైనప్పటకీ తను పుస్తకం ఇచ్చింది అదే చాలు. నేను అత్యంత సంతోషంగా భావించిన విషయమేంటో తెలుసా!  నా మొదటి సంభాషణ తనతో ఒక పుస్తకం గురించి జరగడం. ఇది జరిగాక నాకు తట్టిన విషయమే గాని ముందు అనుకొని చేసింది ఎంతమాత్రం కాదు. అలా యాధృచ్చికంగా జరిగిపోయిందంతే. ఏమైతేనేం ఎప్పుడూ తలుచుకోవడానికి చాలా సంతోషంగాను, గర్వంగానూ ఉంటుంది ఆ పరిచయం.

         ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోటనీ పాఠ్య పుస్తకం తను నాకు ఇచ్చింది. మొదటి పేజీ తెరిచి చూసాను. అక్కడ ఏమీ రాసిలేదు. అయ్యో అనుకున్నా. ఎందుకనుకున్నారా? తన పేరు ఏమన్నా రాసివుంటుందేమో అని ఊహించ. బట్ ఆ మొదటి పేజీలో ఏమీ లేకపోయే సరికి కొంచెం ఆందోళనకి గురయ్యాను. ఇప్పుడెలా? తన పేరెలా తెలుసుకోవడం? మళ్ళీ ఎలా అడగటం. అలా అనుకుంటూనే రెండో పేజీ తిప్పా!  ఈ సారి షాక్ కొంచెం గట్టిగానే తగిలింది. ఇప్పుడర్థమైంది ఆశించనిది దక్కకపోతే కలిగే భాద ఏంటో, ఆశించకుండా ఊహించనిది దొరికితే అందులో ఉండే ఆనందం.రెండో  పేజీ తిరగేసానని చెప్పా కదా. అందులో పైన తన పేరు "వి. పద్మావతి" అని చాల ముద్దు ముద్దు ఆంగ్లాక్షరాళ్లలో రాసిఉంది.  ఒక్కసారిగా ఆంగ్ల భాషపైన ప్రత్యేక గౌరవం ఏర్పడిన రోజు అది. ఆ గౌరవం ఇప్పటికీ అలానే ఉందనుకోండి. నేను తన పేరుని మొదటి పేజీలోనే ఉంటుందని ఊహించా గాని రెండో పేజీలో కాదు. కానీ రెండు పేజీల మధ్య వ్యత్యాసం ఎంతో స్పష్టంగా అర్థం చేసుకున్నాను. మొట్ట మొదటి సారి నా "మనసు దరహాసం" నాకు స్పష్టంగా అర్థమైన రోజు అది.  ఒక్క పేజీ వ్యత్యాసంలో ఇంత తేడా ఏమిటో అర్థం కాలేదు. మొదటి పేజీ చూసినప్పుడు విపరీతమైన దుఃఖం. రెండో పేజీ వీక్షించినప్పుడు పట్టలేని ఆనందం. మనసు ఇంత చిత్రమైనదా? ఇంత త్వరగా మారుతుందా? అందుకే అంటారనుకుంటా ఈ ప్రపంచంలో అత్యంత వేగవంతమైంది మనస్సు అని.

                            ఏంటి ఈ మనస్సు....? అస్సలు అర్థం కావడం లేదు. ఇంతకీ ఈ  మనసు అంటే ఏమిటి...?  ఎలా ఉంటుంది....? అసలు ఉందా?  దీని గురించి ఆలోచించాలి అనిపించింది. చదవాలనిపించింది. "మనసనేది ఏవిధమైనటువంటి భౌతిక పదార్థమ్ కాదు. సాధారణంగా మనసు అనగానే హృదయాన్ని  చూపిస్తారు చాలా మంది. నిజానికి మనసనేదానికి ఎటువంటి ఆకారం, రంగు, రుచి ఉండవు. దాని రుచులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అదొక భావన అని చెప్పొచ్చు. పరిస్థితులకి అనుగుణంగా అది మారుతుంటుంది. దాని వేగం అనంతమని మాత్రం క్లుప్తంగా అర్థమైంది.
     

























Comments

Popular Posts